Oct 03,2022 02:33
జెసిబితో గండిని పూడుస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మార్టూరు - రాజుగారిపాలెం గ్రామాల మధ్య శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందిన వివరాల ప్రకారం.. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షానికి రాజుగారిపాలెం గ్రామానికి ఆనుకొని ఉన్న నేల చప్టాపై నుంచి వర్షపు నీరు భారీ స్థాయిలో ప్రవహిం చింది. దీనికి తోడు పైనుంచి వచ్చే నీటిలో చెట్టుకొమ్మలు, నాచుతో చప్టా దిగువన గల సిమెంట్‌ పైపులు పూడిపోవడంతో వర్షపు నీరు మొత్తం చప్టా పైనుంచి ప్రమాదకరంగా ప్రవహించింది. ఇదే సమయంలో రాజుగారిపాలెం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మార్టూరు వెళ్లడానికి తన సుజుకి బైక్‌పై చప్టాపై ప్రవహిస్తున్న వర్షపు నీటిలో బైక్‌తో దాటడానికి ప్రయత్నించే క్రమంలో నీటి ఉధృతికి బైక్‌ గల్లంతవ్వగా శ్రీరాములు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. సర్పంచ్‌ ఉప్పలపాటి తిరుపతిరాజు గ్రామస్తులతో కలిసి జెసిబి సహాయంతో చప్టాపై పూడికను తొలగించి గండిని పూడ్పించడంతో రాకపోకలు తిరిగి కొనసాగాయి.