Sep 14,2021 20:35

                                       - 'చలో శ్రీనివాసపురం'పై పోలీసుల నిర్బంధం
ప్రజాశక్తి-పశ్చిమగోదావరి జిల్లా : గత నెల 13న హత్యకు గురైన దళిత పాలేరు ముప్పిడి రాజు కేసులో అసలు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత శోషణ ముక్తిమంచ్‌ (డిఎస్‌ఎంఎం) ఆలిండియా కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని రాజు కుటుంబసభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ చలో శ్రీనివాసపురం పిలుపునిచ్చి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిసిన పోలీసులు తూతూమంత్రంగా ఒక అనుమాతుడిని అరెస్టు చేశారని విమర్శించారు. నిందితులకు కొమ్ముకాస్తున్న జంగారెడ్డిగూడెం డిఎస్‌పిని సస్పెండ్‌ చేయాలని, న్యాయపోరాటం చేస్తున్న రాజు తల్లిదండ్రులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాజు హత్యను జాతీయస్థాయి సమస్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీంద్ర, అందుగుల ఫ్రాన్సిస్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పల్లంట్ల మంగరాజు, రాజు తల్లిదండ్రులు యేసు, మరియమ్మ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
పలువురు నేతల గృహనిర్బంధం
చలో శ్రీనివాసపురం కార్యక్రమానికి దళిత, ప్రజాసంఘాల పిలుపు నేపథ్యంలో పోలీసులు నాయకులను గృహనిర్బంధించారు. తాడేపల్లిగూడెంలో సిపిఎం అప్‌ల్యాండ్‌ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, ఏలూరులో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, పాలకొల్లులో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐల్యాండ్‌ సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యాన, పాలకొల్లులో మాలమహానాడు కార్యకర్తలు నేలపై పడుకుని నిరసన తెలిపారు.