
ప్రజాశక్తి-చీరాల: కాంట్రాక్టర్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యింది. పనికి వెళ్లివస్తాను.. సాయంత్రం వస్తా.. తినుబండారాలు కొనుక్కొస్తా నాన్న.. అమ్మ మాట వినండి.. జాగ్రత్తగా ఆడుకోండి.. అంటూ తన ముగ్గురు చిన్న పిల్లలతో ప్రేమగా చెప్పి ఇంటి నుంచి పనికి వెళ్లిన ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ చేదు నిజాన్ని చిన్నారులు జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఈ విషాద ఘటన మండలంలోని విజయనగర కాలనీ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... విజయ నగర కాలనీకి చెందిన కాకాని మంగమ్మ, అబ్రహాంల పెద్దకుమారుడు కాకాని శ్యామేల్(42) కాంట్రాక్టర్ వద్ద కరెంట్ పనులకు వెళ్తుంటాడు. భార్య జయలక్ష్మి ఇద్దరూ కూలి పనులు చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే కరెంట్ పని నిమిత్తం విద్యుత్ కాంట్రాక్టర్ ఆంధ్రయ్య వద్దకు విజయనగరకాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ల పనిలో నిమగమయ్యాడు. కరెంట్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఉన్నపళంగా విద్యుత్ సరఫరా అవ్వడంతో శ్యామేల్ విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు విషయాన్ని గమనించి కాంట్రాక్టర్‌కు సమాచారం అందించారు. సహకాలంలో కాంట్రాక్టర్ స్పందించక పోవడంతో తోటి పనివాళ్లు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో తీగలపై వేళాడుతున్న శ్యామేల్‌ను తాడు సాయంతో కిందకు దించారు. తరువాత చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆపాటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోస్ట్‌మార్టానికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో కాలనీలో విషాదఛాయలు అలముకొన్నాయి.
మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: గ్రామస్తుల డిమాండ్
విద్యుత్ పనులు చేసేటప్పుడు కరెంట్ సరఫరాను నిలుపుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ ఆంధ్రాయ్య, అధికారులుపై శాఖపరమైన చర్యలు తీసుకొని బాధిత కుంటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు లక్ష్మీనరసయ్య, గ్రామస్థులు డిమాండ్ చేశారు.