May 29,2023 21:48

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశకి - వీరఘట్టం:  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి విఎఎలకు హెచ్చరించారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో విఎఎలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మీ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో విఫలమయ్యామని, మరోసారి అటువంటి తప్పు చేయకుండా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు రైతులకు చేరువయ్యేలా చూడాలన్నారు. త్వరలో విత్తనాల పంపిణీలో ఎటువంటి లోపాల్లేకుండా చూడాల న్నారు. ప్రతి విషయాన్ని గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపిటిసిల దృష్టికి తీసుకువెళ్లాల న్నారు. అలాగే జూన్‌ ఒకటో తేదీన పాలకొండ మార్కెట్‌ యార్డ్‌లో నిర్వహించనున్న రైతు భరోసా నాలుగో విడత కార్యక్రమానికి మీ పరిధిలోని ఉన్న రైతులందర్నీ అధిక సంఖ్యలో తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌ మాట్లాడుతూ ఎవరు నిర్లక్ష్యం వహించినా వారికి మెమో ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యవసాయ కార్యక్రమాలకు సర్పంచు లకు సమాచారం చేయాలన్నారు. ముఖ్యంగా సర్పంచుల నుండి ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు భరోసా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు వచ్చేలా చూడాలన్నారు. మండల వ్యవసాయ అధికారి కె.మన్మధరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, ఎంపిడిఒ వై.వెంకటరమణ, వ్యవసాయ మండల సలహా కమిటీ చైర్మన్‌ కె.లీలా ప్రసాద్‌, విఎఎలు పాల్గొన్నారు.