Sep 15,2021 07:35
  • బహిరంగ విచారణకు ససేమిరా

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి : స్మార్ట్‌ విలేజ్‌ క్లస్టర్‌ ఎగ్జిక్యూటివ్‌, క్లస్టర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి బిజెపి కార్యకర్తలు లక్షల రూపాయలు వసూలు చేసిన విషయం బహిర్గతమైనా విచారణ పేరుతో బిజెపి కొత్త నాటకానికి తెరదీసింది. స్మార్ట్‌ విలేజ్‌ రీజనల్‌ మేనేజర్‌ హోదాలో నర్సీపట్నానికి చెందిన బిజెపి కార్యకర్త ఇండిపూడి సుధాకర్‌... క్లస్టర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు నకిలీ నియామకపత్రాలు జారీ చేస్తున్న విషయం వెలుగు చూసినప్పటికీ, కొంతమంది పెద్దలు ఈ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో వారిపై చర్యలు తీసుకోలేక విచారణ పేరుతో కాలయాపనకు తెరతీసింది. విలేజ్‌ క్లస్టర్‌ అసిస్టెంట్‌ నకిలీ నియామకాలపై ప్రజాశక్తి వరుస కథనాలు ప్రచురించడంతో.. ఈ విషయంపై బిజెపి త్రిసభ్య కమిటీని నియమించింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూళ్లలో బిజెపి కార్యకర్తల పాత్రపై విచారించేందుకు కిసాన్‌ మోర్చా జోనల్‌ ఇన్‌ఛార్జ్‌ పి.రవిరాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దూలం బూసిరాజు, పట్టాబి ప్రసాద్‌తో త్రిసభ్య కమిటీని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గండి వెంకట సత్యనారాయణరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నష్టపోయిన వ్యక్తులు స్వయంగా గానీ, ఫోన్‌ ద్వారాగానీ వారం రోజుల్లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. నకిలీ నియామక పత్రాలు సుధాకర్‌ పేరున ఉన్నప్పటికీ ఆయనపై చర్య తీసుకొనే సాహసం ఆ పార్టీ చేయలేకపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. డబ్బుల వసూళ్ల వ్యవహారంలో పెద్ద నాయకుల పాత్ర కూడా ఉండడంతో, నకిలీ నియామక పత్రాల జారీపై ఆధారాలున్నా, వాటిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోంది. సుధాకర్‌ వంటి వ్యక్తులపై చర్యకు దిగితే ఆయన ఇతరుల పేర్లను బయటపెడతారన్న భయంతో కాలయాపన కోసం త్రిసభ్య కమిటీని బిజెపి నియమించిందన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.