Jan 13,2022 10:55

రాంచీ : జార్ఖండ్‌లో ఓ నిరుపేద వ్యక్తి ఖాతాలో రూ. 75 కోట్ల నగదు జమ అయ్యింది. అన్ని కోట్లు ఖాతాలో ఉండటంతో.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయం బ్యాంకు అధికారుల వద్దకు చేరడంతో.. ఎక్కడ నుండి వచ్చిందా అంత డబ్బు అని ఆరా మొదలు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దుమ్కా జిల్లాలో జార్ముండి మండలం సాగర్‌ గ్రామానికి చెందిన పూలోరారు అనే వ్యక్తి.. భార్య, కుమారుడు కలిసి. ఓ పూరి గుడిసెలో జీవిస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో ఖాతా ఉండటంతో.. తనకు వచ్చిన పింఛను డబ్బులు తీసుకునేందుకు దగ్గరలోని సర్వీసు సెంటర్‌కు వెళ్లారు. రూ.10,000 తీసుకుని.. మిగిలిన డబ్బులు చూసుకుంటే.. రూ.75.28 కోట్లు ఉన్నట్లు చూశారు. ఒకటి.. రెండు సార్లు చెక్‌ చేసినా అంతే ఉండటంతో అవాక్కయారు. అవెలా వచ్చాయో తనకు తెలియదని అన్నారు. ఈ విషయం బ్యాంకు అధికారులకు చేరగా.. ఫూలోరారు ఖాతాలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేస్తామన్నారు.