Feb 20,2021 19:49

సేవ ... ఆమె కుటుంబ వారసత్వం. పేదలకు సాయపడడంలో, సమాజసేవలో తాత ముందుండేవారని తండ్రి చెప్పిన మాటలు వింటూ పెరిగింది. పెరిగి పెద్దై తాను కూడా ఆ బాటలోనే నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె గుర్తింపు ఆ తాత మనవరాలిగా కాదు... 10 రూపాయల వైద్యురాలుగా నూరీ పర్విన్‌గా ఎంతోమందికి పరిచితం.

నూరీ స్వస్థలం విజయవాడ ఆటోనగర్‌. వన్‌టౌన్‌ మౌలానా ఆజాద్‌ ఉర్దూ స్కూలులో పదవతరగతి వరకు చదివింది. ఆ తరువాత ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసింది. కడప ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎఫ్‌ఐఎంఎస్‌)లో ఎంబిబిఎస్‌ సీటు రావడంతో వైద్యవిద్య పూర్తిచేసింది. కోర్సు మొదటి సంవత్సరం నుంచే ఎఫ్‌ఐఎంఎస్‌ విద్యార్థి ఆర్గనైజేషన్‌ ద్వారా పలు వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు వెళ్లి సేవలు చేసింది. అప్పుడే వైద్యం కోసం పేదలు పడే ఇబ్బందులు ఆమె దృష్టికి వచ్చాయి. ఎలాగైనా పేదలకు అందుబాటులో వైద్యం అందించాలన్న సంకల్పంతో కడప మాసాపేట సర్కిల్‌ పెద్ద దర్గా రోడ్డులో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌ తెరిచింది. చాలా చిన్న క్లినిక్‌ అది. అక్కడికి వచ్చే రోగులకు నామమాత్రంగా పది రూపాయల ఫీజే తీసుకుంటుంది. బెడ్‌ అవసరమైన వారికి రూ.50, రూ.500లోపే మందులు అక్కడ లభిస్తాయి. ఐదుగురు సిబ్బందితో 24 గంటలూ పనిచేస్తోంది ఆ క్లినిక్‌. రోజుకు 50 మంది వరకు రోగులు ఆ క్లినిక్‌కు వస్తున్నారు. 'గది అద్దె, సిబ్బంది జీతభత్యాల కోసమే ఈ ఫీజు వసూలు చేస్తాం' అంటోంది ఆమె. అంత తక్కువ ఫీజు ఎందుకంటే 'నా లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు.. సేవ చేయడం' అంటుంది ఈ యువ డాక్టరు. ఆ ప్రాంతం వారికి 10 రూపాయల డాక్టరమ్మగా ఆమె సుపరిచితురాలు. ఏడాది కాలంలోనే అంత పేరు తెచ్చుకుంది నూరీ పర్విన్‌.

 నిరుపేదల డాక్టరమ్మ
కోవిడ్‌కు సరిగ్గా నెల రోజుల ముందే అంటే 2020 ఫిబ్రవరి 7న క్లినిక్‌ ప్రారంభించింది. తన దగ్గరకు వచ్చే రోగులకు ఓ ఎంబిబిఎస్‌ డాక్టరుగా వీలైన చికిత్స ఇస్తూనే ఇతర వైద్య అవసరాల నిమిత్తం ప్రముఖ వైద్య నిపుణుల దగ్గరకు పంపిస్తుంది. అలా ఆమె దగ్గరకు వచ్చిన ఎంతో మంది రోగులు సకాలంలో మెరుగైన చికిత్స తీసుకుని వ్యాధి నయం చేసుకున్నారు. ఆరోగ్యవంతులుగా తిరిగివస్తున్న రోగుల ముఖాలు చూస్తుంటే ఇంత చిన్న క్లినిక్‌లో ఏమాత్రం వైద్యం అందుతుంది అని విమర్శించేవాళ్ల నోర్లు మూతపడుతున్నాయి.


లాక్‌డౌన్‌ సమయంలో ...
'లాక్‌డౌన్‌ కాలంలో క్షణం తీరిక లేకుండా గడిపాను. నుంచోడానికి, చివరికి మంచీనీళ్లు తాగేందుకు కూడా సమయం ఉండేది కాదు. వాస్తవానికి లాక్‌డౌన్‌ వల్ల క్లినిక్‌ ప్రారంభించిన నెలరోజులకే మూసేయాల్సి వచ్చింది. అయితే రెండు రోజులు కూడా నేను ఖాళీగా కూర్చోలేకపోయాను. అప్పటికే నాకు ఎన్నో ఫోను కాల్స్‌ వచ్చేవి. జ్వరం, దగ్గుతో బాధపడుతూ కోవిడ్‌ భయంతో ఎంతోమంది రోగులు నన్ను సంప్రదించేవారు. పెద్ద పెద్ద క్లినిక్‌ల వారు సిటీ స్కాన్‌ తీయించుకోమంటున్నారని, ఆర్థికంగా అంత భారం మోయలేకపోతున్నామని చెప్పేవారు. ప్రతి జ్వరమూ, దగ్గు కోవిడ్‌ కాదని వారికి ధైర్యం చెప్పి క్లినిక్‌లోనే మందులు ఇచ్చేదాన్ని. అనుమానమున్న వారిని పరీక్షలకు పంపించేదాన్ని. అంతేగాని వైద్యం చేయడానికి నిరాకరించేదాన్ని కాదు. వైద్యవృత్తి సేవాగుణంతో నిండి ఉండాలి. ప్రతిదీ వ్యాపారమైన ఈ రోజుల్లో కొంతమంది ఈ కోవిడ్‌ సమయంలో లాభార్జన కోసం అధిక ఫీజులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేయడం నాకు తెలుసు.
తాతయ్య స్ఫూర్తి నాపై ఉంది. పేదలకు సాయం చేయాలని చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న చెప్పేవారు. ఆ మాటలే నన్ను ఈ మార్గం వైపు నడిపించాయి. క్లినిక్‌ మొదలుపెట్టే సంగతి నా తల్లిదండ్రులకు మొదట చెప్పలేదు. ఎంబిబిఎస్‌ చదివి 10 రూపాయలకు వైద్యం చేయడమేంటని అంటారని వారికి చెప్పలేదు. కాని విషయం చెప్పగానే ఎంతో సంతోషించారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పుడు నేను నూర్‌ మహ్మద్‌ మనవరాలిగా కాదు, 10 రూపాయల డాక్టరు నూర్‌ పర్విన్‌గా సొంత పేరు తెచ్చుకున్నాను' అంటారు ఆమె. తన సేవకు గుర్తింపుగా పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవార్డులు ఇచ్చాయి. అయితే వాటన్నిటికంటే పేదలకు సేవ చేయడమే సంతృప్తినిస్తుంది అంటుంది ఆమె.

 నిరుపేదల డాక్టరమ్మ
ఆదర్శ కుటుంబం
నూరీ తాతగారు నూర్‌ మహమ్మద్‌. 1980లో వామపక్ష నాయకుడుగా ప్రజా సేవలో నిమగ్నమైన ఆయన నూరీ తండ్రి చిన్నప్పుడే మరణించారు. అయితే పిల్లలకు తండ్రి గొప్పతనం గురించి ఆయన తరచూ చెబుతుండేవారు. అలా తాత సేవగుణాన్ని వింటూ పెరిగిన ఆమె ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. సామాన్యకుటుంబంలో ఒకరు వైద్యవిద్య అభ్యసించడమే కష్టమైన ఈ రోజుల్లో నూరీ తండ్రి తన ముగ్గురు బిడ్డలనూ వైద్య విద్యార్థులుగా తీర్చిదిద్దారు. 'తండ్రి జ్ఞాపకార్థమే నాకు ఆయన పేరు పెట్టారు' అంటుంది నూరీ. అలా ఆ తాత సేవాతత్పరత...తండ్రి క్రమశిక్షణలో పెరిగిన నూరీ తల్లిదండ్రులు మెచ్చే బిడ్డగానే కాక... తాత పేరు నిలబెట్టిన మనవరాలిగా ఎదిగింది.
బహుముఖ ప్రజ్ఞ
చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే నూర్‌ సాధించిన ఘనత ఆమె చదివిన స్కూలు పిల్లలకు స్ఫూర్తిమంత్రమైంది. ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఆమె సేవాగుణాన్ని ప్రశంసిస్తూ ఫోన్లు చేస్తుంటారు. అక్కడి విద్యార్థులు తనను కలుసుకోవాలనుకుంటున్నారని, కాని తీరిక లేని పని ఒత్తిడితో వారిని కలవలేకపోతున్నానని అంటారు నూర్‌. రెండు సంవత్సరాల క్రితం ఓ 20 షార్ట్‌ఫిలిమ్స్‌ చేశారు. వరకట్న సమస్యలు, ఆత్మహత్యలు, స్త్రీ వివక్ష వంటి వాటిపై తీసిన ఆ డాక్యుమెంటరీలను దర్శకత్వం చేయడమే కాదు, వాటిలో నటించారు నూర్‌. భవిష్యత్తులో పేదల కోసం ఓ మల్టీస్పెషాలిటీ హాస్పటల్‌ తెరవాలని, అందులో కూడా తక్కువ ఖర్చుతోనే వైద్యం అందించాలని కలలు కంటున్నారు. ఆమె కల తప్పక నెరవేరాలని మనమూ కోరుకుందాం. వైద్యం వ్యాపారమైన ఈ రోజుల్లో సేవే ప్రధానంగా సాగుతున్న ఆమె మార్గం స్ఫూర్తిదాయకం.


                                                                                            సంభాషణ : జ్యోతిర్మయి