Feb 06,2023 20:37

బొల్లింకలపాలెంలో కూల్చివేసిన ఇల్లు

ప్రజాశక్తి- భోగాపురం : ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాలైన బొల్లంకిలపాలెం, రెల్లిపేట, ముడసర్ల పేటలో సోమవారం అధికారులు పాఠశాలలను, ప్రభుత్వ స్థలాలలో ఉన్న భవనాలను తొలగించారు. ఆర్‌డిఒ సూర్యకళ, తహశీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు, ఎయిర్‌పోర్టు అధికారి గిరడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో భవనాలతో పాటు ఇళ్లను కూల్చే కార్యక్రమం చేపట్టారు. అలాగే పక్క గ్రామాలకు కరెంట్‌కూడా కట్‌ చేశారు. నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయని, కొద్ది రోజులు సమయం ఇస్తే నిర్మాణాలు పూర్తి చేసి గ్రామాలను ఖాళీ చేస్తామని బాధితులు చెప్పినప్పటికీ ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని బాధితులు వాపోయారు. గ్రామాల్లో ప్రజలు లేని సమయాల్లో వచ్చి ఇళ్లను కూల్చి వేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రెల్లి పేటలో బాధితులు నిమ్మకాయల లక్ష్మి, బొల్లింకుల లక్ష్మి మాట్లాడుతూ తమ ఇళ్లకు పరిహారం కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని అన్నారు. మంగళవారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో ఇళ్లను తొలగించే ప్రక్రియ చేపడతామని, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నూతన పాఠశాల భవనాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. మరడ పాలెంలో కూడా తొలగింపు ప్రక్రియ మంగళవారం ఉంటుందని అధికారులు తెలిపారు.