Jun 11,2021 21:22

సమావేశంలో మాట్లాడుతున్న అరుణ్‌

ప్రజాశక్తి-విఆర్‌.పురం : పోలవరం ముంపు నిర్వాసితులకు పునరావాసం చూపకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం అన్యాయమని సిపిఎం జిల్లా (రాజమహేంద్రవరం) కార్యదర్శి టి.అరుణ్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన మండలంలోని పోలవరం ముంపు గ్రామాల్లో సిపిఎం బందంతో కలిసి పర్యటించారు. ములకలపల్లి, కొటారుగొమ్ము, జీడిగుప్ప, శ్రీరామగిరిలో నిర్వాసిత గ్రామాల్లో బాధితులతో మాట్లాడారు. అనంతరం శ్రీరామగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్‌ మాట్లాడారు. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్న బాధితుల గోడు వినకుండా ప్యాకేజీ, ఇల్లు చూపకుండా ఇక్కడ నుండి నిర్వాసితులను తరలించే చర్యలు ప్రభుత్వం చేస్తోందని అరుణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ చెల్లించాకే ప్రాజెక్టు నిర్మించాలని, దానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. కాపర్‌ డ్యామ్‌తో నిర్వాసితులను ఆందోళనకు గురి చేయడం తగదన్నారు. కనీసం పాలక ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఏకంగా పోలవరం పనులు పూర్తి చేస్తున్నారని ఇదెక్కడి అన్యాయం అని ఆయన ప్రశ్నించారు. ఒకపక్క అధికారులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అంటున్నారని, వరదతో గుట్టలపై రెండు మూడు నెలల ఎలా బతుకులు సాగిస్తారని ప్రశ్నించారు. బాధితులు ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో బాధలు తప్పవని చెప్పారు. ప్రభుత్వం నిర్వాసితులు గోడు ఆలకించాలని, ప్రాజెక్టు నిర్మాణం ఆపి పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ పునరావాసం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడి నుండి శాస్వత పునరావాస గ్రామాలకు తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే సిపిఎం పక్షాన పోరాటాలు ఉధృతం చేయక తప్పని అరుణ్‌ హెచ్చరించారు. ఈ పర్యటనలో సిపిఎం మండల కార్యదర్శి బొప్పెన కిరణ్‌, శ్రీరామగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌ డివిజన్‌ నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి శ్రీనివాస్‌, సోయం చినబాబు, పల్లపు వెంకట్‌, సీసం సురేష్‌, కొండారెడ్డి, ఎన్‌.ప్రకాష్‌, గుండెపూడి లక్ష్మణరావు, పులి ధర్మరాజు, సిహెచ్‌.సుబ్బారావు, సున్నం చంద్రరావు, తోడం రాజు, కాంతారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.