Nov 25,2021 11:19

న్యూఢిల్లీ :  నిర్వాసితులపై  రైల్వే శాఖ ద్వంద్వ వైఖరిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే ట్రాక్‌ల పక్కనే ఉన్న మురికివాడల నివాసితులకు పునరావాసం కల్పించడంపై వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఎదుట రైల్వే చెప్పిన విరుద్ధమైన వైఖరిని ప్రశ్నిస్తూ.. వివరణనివ్వాలని ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అత్యున్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. వారంలోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సూరత్‌లోని రైల్వే లైన్లకు సమీపంలో సుమారు 10 వేల మందికి పైగా మురికి వాడల నివాసితులను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ గుజరాత్‌ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. పునరావాసం కల్పించకుండా.. వారి ఇళ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్లు పేర్కొన్నారు.
అయితే వారి పునరావాసానికి సంబంధించి సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, గుజరాత్‌ హైకోర్టులో రైల్వే చెప్పిన వైరుధ్య స్పందనలను జస్టిస్‌ ఎఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సి.టి రవికుమార్‌ ధర్మాసనం ఎదుట ఎన్‌జిఒ తరుపు సీనియర్‌ అడ్వకేట్‌ కొలిన్‌ గోసాల్వేస్‌ వివరించారు. మంత్రిత్వ శాఖ తరుపు వాదనలు వినిపిస్తున్న సొలిసీటర్‌ జనరల్‌.. దీని కోసం ఓ విధానాన్ని రూపొందిస్తున్నట్లు గతంలో కోర్టుకు తెలిపారని కొలిన్‌ అన్నారు. అయితే నిర్వాసితుల పునారావసం కోసం ఢిల్లీ ప్రభుత్వ విధానాన్ని అవలంభిస్తున్నట్లు రైల్వే శాఖ దేశ రాజధానిలోని హైకోర్టుకు తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎటువంటి విధానాన్ని ఆలోచించలేదని గుజరాత్‌ హైకోర్టులో రైల్వే చెప్పిందని అన్నారు. కోర్టుల్లో విభిన్నంగా వివరణలు ఇచ్చినందన్నారు. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని అన్నారు. రైల్వే భూముల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఎటువంటి విధానమూ లేదని అదనపు సొలిసీటర్‌ జనరల్‌ కెఎం నటరాజ్‌ ధర్మాసనం ముందు తెలిపారు. అయితే ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు ఎదుట రైల్వే చెప్పిన వివిధ వైఖరుల గురించి వివరణ ఇవ్వాలని కోరుతూ.. రైల్వే శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం. తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది.