Dec 08,2022 23:07

ప్రజాశక్తి-నందిగామ 

నకిలీ మిర్చి విత్తనాలు వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం,కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు గురువారం నందిగామ పాతబస్టాండ్లో రైతు నేస్తం పాపు వద్ద ధర్నా చేశారు. అనంతరం పాతబస్టాండుకు వెళ్ళే రోడ్డుపై బైఠాయించారు. పాపు యజమాని నలజాల పూర్ణ పాపు మూసి సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ పరారీలో ఉండటంపై రైతు నాయకులు బాదిత మిర్చి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా కౌలు రైతు సంఘం ఎన్టిఆర్‌ జిల్లా అధ్యక్షులు సీతారెడి , రైతు సంఘం ఎన్టిఆర్‌ జిల్లా అధ్యక్షులు పివి ఆంజనేయులు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు మాట్లాడుతూ గంపలగూడెం మండలం పెనుగొలును గ్రామ శివారు జింకలపాలెం తండా రైతులు సుమారు 50 మంది నందిగామ పాతబస్టాండు రైతునేస్థం షాపులో సుమారు 5 కేజిల వి గోల్డు 500 మిర్చి విత్తనాలు సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి సాగు చేశారని తెలిపారు. ఎకరానికి 35 వేలు నుండి 50 వేల రూపాయల వరకు కౌలు, లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోవటం జరిగిందని తెలిపారు. పంట వేసి నాలుగు నెలలు అయినప్పటికీ మిర్చి పంట ఎదుగుదల లోపించటం, గిడసబారిపోవటం, పూత,పిందె రాక పోవటంతో పాపు యజమాని సంప్రదించిన ఫలితం లేకుండా పోయిందని, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ,ఇతర ప్రభుత్వ అధికారులను కలిసిన పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వి షీల్డు గోల్డు 500 నకిలీ మిర్చి విత్తనాలు అమ్మిన రైతు నేస్తం పాపు యజమాని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాదిత రైతులకు నష్ట పరిహారం యకరానికి 2 లక్షల రూపా యలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. న్యాయం చేసే వరకు ఆందోళన ఉదతం చేస్థామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి,కటారపు గోపాల్‌, గోపి నాయిక్‌, సయ్యద్‌ ఖాసిం, మిర్చి రైతులు షేక్‌ సైదా,జానీ, కరీమా, సత్తార్‌, ఖాసిం, భూక్యా గోపి నాయిక్‌ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి వచ్చి పాపు యజమాని పై చర్యలు తీసుకుంటామని,రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.