Nov 26,2021 01:19

నిందితుడు చిన్నారెడ్డి

ప్రజాశక్తి - పిఎం.పాలెం : తాను 'ఎంపీ విజయసాయి రెడ్డి పిఎ' అంటూ ఓ కేసు విషయమై న్యూపోర్టు సిఐ రాముపై ఒత్తిడి తెచ్చిన అజ్ఞాత వ్యక్తిని గురువారం పిఎం.పాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిఐ ఎ.రవి కుమార్‌ కథనం ప్రకారం.. పిఎం.పాలెంలో నివాసముంటున్న న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌ సిఐ రాముకు మంగళవారం ఉదయం సుమారు 8:50 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన పేరు సుధాకర్‌ రెడ్డి ఆని, ఎంపీ విజయసాయి రెడ్డి పిఎనని పరిచయం చేసుకున్నాడు. క్రైమ్‌ నెంబర్‌ 395/2021 కేసులో జెసిబి యజమానిపై చర్యలు తీసుకోవద్దు అంటూ ఒత్తిడి చేశాడు. అనుమానం వచ్చిన సిఐ తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ఎంపీ విజయసాయి రెడ్డి కార్యాలయంలో వాకబు చేయగా ఆ పేరు, ఆ ఫోన్‌ నెంబర్‌ గల వ్యక్తి ఎవరూ లేరని తేలింది. దీంతో తనపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తిపై సిఐ రాము పిఎం.పాలెం పోలీస్‌ స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సిఐ రాముపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తి సత్తి చిన్నారెడ్డి అలియాస్‌ సుధాకర్‌ రెడ్డి అని గుర్తించారు. నిందితుడు కంచరపాలెంలోని ఐటిఐ జంక్షన్‌ సమీపంలో శివాలయం టెంపుల్‌ అర్చ్‌ వద్ద నివాసం ఉంటున్నట్లు పసిగట్టారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల వద్ద, ప్రముఖుల వద్ద కార్‌ డ్రైవర్‌గా పనిచేసాడని గుర్తించారు. 2014లో కంచరపాలెంలో ఓ కేసు కూడా ఉన్నట్లు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఘటనపై స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి తన పేరును ఇటువంటి చర్యలకు ఉపయోగించుకుంటే ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును ఛేదించిన పిఎం.పాలెం పోలీసులను అభినందించారు.