Nov 26,2021 01:59

నకిలీ పత్రాలతో కబ్జా చేసిన స్థలంలో నిర్మిస్తున్న భవనం

ప్రజాశక్తి - ఆరిలోవ
నిర్వాసిత కాలనీలో మౌలిక వసతుల కోసం కేటాయించిన స్థలానికి ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, వాటి ద్వారా 100 గజాల స్థలాన్ని ఆక్రమించి భవన నిర్మాణం చేస్తున్నాడు. ఈ స్థలం ఆక్రమణపై స్థానికులు ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నాడు. అధికారుల చేతివాటం, రాజకీయ నాయకుల అండదండలతో బిల్డింగ్‌ప్లాన్‌, విద్యుత్‌ మీటర్‌ వంటివి తెచ్చుకున్నాడు. దీనిపై ఆర్‌టిఐ ద్వారా దరఖాస్తు చేయగా, సదరు వ్యక్తి చూపిస్తున్న పత్రాలు నకిలీవని తేలినట్లు స్థానికులు చెబుతున్నారు.
బిఆర్‌టిఎస్‌ రోడ్డు నిర్మాణం సమయంలో రామకృష్ణాపురంలో నిర్వాసితులుగా మారిన వారికి జివిఎంసి 13వ వార్డు పైనాపిల్‌ కాలనీ వద్ద పునరావాసం కల్పించగా, ఎస్‌ఎస్‌ఎన్‌ నగర్‌ ఏర్పాటైంది. ఆ సమయంలో కాలనీ వాసులకు మౌలిక వసతుల కోసం జివిఎంసి కొంత ఖాళీ స్థలాన్ని ఉంచింది. ఈ ఖాళీ స్థలంపై ఓ కబ్జాదారుని కన్ను పడింది. అంతే నగరంలో ఎక్కడో స్థలం పోయిందని, ఆ స్థలానికి బదులుగా ఇక్కడ ఖాళీగా ఉన్న స్థలం కేటాయించారంటూ నకిలీ పత్రాలు సృష్టించి, రాజకీయ నాయకుల అండతో ఈ స్థలాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. భవన నిర్మాణానికి పునాదులు ఏర్పాటు చేశాడు. తమ మౌలిక వసతుల కోసం ఉంచిన స్థలం కబ్జాపై స్థానికులు ప్రశ్నించగా, కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగినట్లు స్థానికులు అంటున్నారు. దీంతో ఈ స్థలం విషయమై స్థానిక సంఘం నాయకులు ఆర్‌టిఐ ద్వారా పలు సార్లు జోనల్‌ కార్యాలయం, జివియంసి ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఈ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని ఆర్‌టిఐ ద్వారా సమాధానం వచ్చింది. అయినా అధికారుల చేతి వాటం, నకిలీ పత్రాలతో బిల్డింగ్‌ ప్లాన్‌ పర్మిషన్‌, విద్యుత్‌ మీటరు కూడా తెచ్చుకున్నాడంటే సదరు వ్యక్తి ఎంతటి ఘనుడో అర్ధం చేసుకోవచ్చు. జివియంసి కమిషనర్‌గా డాక్టర్‌ సృజన ఉన్నంతవరకు స్తబ్ధతగా ఉన్న కబ్జాదారుడు, ఆమె బదిలీ అయిన వెంటనే రాజకీయ నాయకుల అండదండలతో హడావుడిగా స్లాబ్‌ వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ మౌలిక వసతుల కోసం ఉంచిన స్థలాన్ని కబ్జాదారుల పరం కావడంతో స్థానికులు మండి పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్థలానికి చెందిన పత్రాల నిజానిజాలను నిగ్గు తేల్చి, స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, నకిలీ పత్రాలను సృష్టించి, స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.