Jun 27,2021 10:26

నల్లమల అడవిలో కుయుక్తి అనే పేరు గల నక్క ఉండేది. అది పేరుకు తగ్గట్టే లేచింది మొదలుకొని పడుకునే వరకు చెడు ఆలోచనలతో జీవించేది. అడవిలోని అమాయక పక్షులను, జంతువులను బెదిరించి తనకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించేది. ఏరోజూ కష్టపడి ఆహారాన్ని సంపాదించుకునేది కాదు. అడవిలో నివసించే దున్నలు, ఏనుగులకు మాత్రం తాను అడవికి రాజైన సింహానికి సలహాదారుడినని చెప్పుకుని, పబ్బం గడుపుకునేది. నక్క చేసే అరాచకాలు తెలిసినా అవి ఊరకుండేవి. కుయుక్తి కొత్త కొత్త పన్నాగాలతో నల్లమలలోని పక్షులు, జంతువులపై తన పెత్తనాన్ని చెలాయించేది.
ఒకరోజు కుయుక్తి అడవి మధ్యలో పక్షులు, జంతువులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో అడవిలోని ప్రాణులను ఉద్దేశించి.. 'ఓ ప్రియ నేస్తాల్లారా! నాకు రాత్రి ఓ కల వచ్చింది. దాన్ని అమలుపరచాలని అనుకుంటున్నాను. రేపటి నుండి ప్రతిరోజు పక్షులు పళ్ళను, జంతువులు మాంసాహారంతో పాటుగా ఆయా ఋతువుల్లో దొరికే ఇతర ఆహార పదార్థాలను తను నివాసముండే మర్రిచెట్టు వద్దకు తెచ్చి, అందించాలి. మీలో ఎవరయినా ఈ కట్టుబాటును ధిక్కరిస్తే అడవికి రాజైన సింహానికి చెప్పి, మీ రక్తాన్ని కళ్ళజూస్తాను!' అని హూంకరించింది. కుయుక్తి అన్నంత పని చేయగలదు అని భయపడ్డ పక్షులు, జంతువులు సరేనని తల ఊపాయి. కుయుక్తికి ప్రతిరోజు సరైన సమయానికి ఆహారం అందించేవి. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. సమయానికి ఆహారం తేలేదని ఒకరోజూ కోతిపై, మరొక రోజు చిలుకపై కుయుక్తి దాడి చేసి, గాయపరచింది. రానురాను ఆ అడవిలో నక్కచేసే దౌర్జన్యాలకు అంతేలేకుండా పోయింది.
ఒకటి, రెండుసార్లు పక్షులు, జంతువులు కుయుక్తి చేసే అరాచకాలను సింహానికి చెప్పాలని అనుకున్నాయి. అది ఉండే గుహ దగ్గరకు వెళ్ళాయి. కానీ ఆ సమయంలో సింహం గుహలో లేదు. చేసేదేమీలేక అవి నిరాశతో తిరిగివచ్చాయి. హఠాత్తుగా ఓ రోజు కుయుక్తి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి, అడవిలోని పక్షులు, జంతువులను పిలిచింది. అది ఇలా చెప్పసాగింది. 'నాకు.. పొరుగునే ఉన్న చిట్టడవిలోని నక్కతో వివాహం నిశ్చయమయింది. వారం రోజుల్లోనే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు ఘనంగా చేయాలి!' అని అడవి ప్రాణులను ఆదేశించింది. అప్పటికి సరేనన్న అవి.. మరోచోట రహస్యంగా సమావేశమై కుయుక్తికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాయి.
అనుకున్న రోజు రానే వచ్చింది. జంతువులన్నీ కుయుక్తిని అలంకరించి, ఏనుగుపై కూర్చోబెట్టి ఊరేగించాయి. అప్పటికే చీకటి పడటంతో ఊరేగింపును ఆపిన జంతువులు ఆ రోజుకి సెలవు తీసుకుని వెళ్ళాయి. అంతకుముందే కుయుక్తి నివాసముండే మర్రిచెట్టు కింద కర్రలతో ఓ వేదికను ఏర్పాటు చేసి, తీగలతో అలంకరించింది కోతి. వేదిక ముందు పెద్దగోతిని తవ్వి దానిమీద కొమ్మలు, ఆకులు, పూలు వేసి పూలపాన్పుగా మార్చింది. ఈ పనికి మిగతా జంతువులు, పక్షులు కోతికి సహాయం చేశాయి. ఊరేగింపు పూర్తయ్యాక కుయుక్తి తన నివాసానికి చేరుకుంది. తనకు జరిగిన ఏర్పాట్లను చూసి, ఉబ్బితబ్బిబ్బయ్యింది. వేదికపై కాసేపు కూర్చొని, కుయుక్తి ఆనందపరవశంతో పూలపాన్పుపైకి ఒక్కసారిగా దూకింది. నక్క దూకిన వేగానికి పాన్పుకు ఊతంగా ఉన్న కొమ్మలు విరిగి, ఒక్కసారిగా గోతిలో పడింది. ఊహించని ఈ పరిణామానికి ఉక్కిరిబిక్కిరైంది కుయుక్తి. రక్షించమని అది వేసిన కేకలు అరణ్యరోదనలయ్యాయి. తెల్లవారింది. చిట్టడవి నుంచి వచ్చిన ఆడనక్క పెళ్ళిబృందం కుయుక్తి కోసం అడవిలో వెతికి వెతికి, గోతిలో పడ్డ దాన్ని చూసింది. అతికష్టం మీద నక్కను బయటకు తీసింది. రెండు కాళ్ళు విరిగిన దాన్ని చూసి, మొదట జాలిపడింది. నక్కజాతిలో పుట్టి తనను తాను రక్షించుకోలేని దానికి తమ అమ్మాయిని ఇచ్చేదిలేదని అక్కడి నుంచి పెళ్లిబృందం వెళ్ళిపోయింది. కాళ్ళు విరిగి, నడవలేని కుయుక్తికి ఇన్నాళ్ళకు తగిన శాస్తి జరిగిందని అడవిలోని పక్షులు, జంతువులు ఆ రోజు పెద్ద సంబరాన్ని జరుపుకున్నాయి.
- తూర్పింటి నరేశ్‌ కుమార్‌, 81848 67240