Oct 19,2021 00:57

యలమంచలిలో ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి - విలేకర్ల బృందం
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను, 2020 విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన సోమవారం అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్డు తదితర ప్రాంతాల్లో రోలురోకో నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ ఆపాలని, పెంచిన పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను పదవి నుండి తొలగించాలని, ఆయన కొడుకు ఆశిష్‌ మిశ్రాను కఠినంగా శిక్షించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
అనకాపల్లి : కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో రైతు సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు, ఐద్వా, ఎన్‌పిఆర్‌డి ఆధ్వర్యాన రైలురోకో నిర్వహించారు. ఇది గమనించిన పోలీసులు అక్కడకు చేరుకొని ఆయా సంఘాల నాయకులు 14 మందిని అరెస్టు చేసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయినవారిలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు, ప్రజా సంఘాల నాయకులు గంటా శ్రీరామ్‌, తరుణ్‌, నూక అప్పారావు, అజరు కుమార్‌, సుభాషిణి, ఎఐటియుసి నాయకులు వైఎన్‌.భద్రం, కోన లక్ష్మణ, కె.శంకరరావు, టి.వెంకటేశ్వరరావు, కెవి.రమణ, వీరాచారి, ఎం.సూరిబాబు ఉన్నారు. అక్రమ అరెస్టులు తగదని, రైతు చట్టాలు రద్దయ్యే వరకు ఉద్యమం ఆగదని నాయకులు హెచ్చరించారు.
అచ్యుతాపురం/యలమంచిలి : సిఐటియు ఆధ్వర్యాన యలమంచిలి రైల్వేస్టేషన్‌ వద్ద రైలురోకోకు వెళ్తుండగా, స్ధానిక పోలేసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి వ్యాన్‌లో పడేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యదర్శి రొంగలి రాము, నాయకులు జి.దేముడునాయుడు, కె.సోమినాయుడు, భాస్కర్‌, కాశీ, నారాయణ, కూర్మరావు, రావి దేముళ్లు తదితరులున్నారు.
నక్కపల్లి : నర్సీపట్నం రైల్వే స్టేషన్‌ వద్ద సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైలురోకో చేయడానికి ప్రయత్నించగా, ఎస్‌.రాయవరం, తుని రైల్వే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. అనంతరం నాయకులను అరెస్ట్‌ చేసి ఎస్‌.రాయవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్‌, సీపీఎం నాయకులు డేవిడ్‌ రాజు, త్రినాథ్‌, లోవరాజు, కాశీరావు, వరహాలు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.