Oct 24,2021 12:31

ఆమె తెలుగు తెరపై బాపు గీసిన బొమ్మ. తమిళనాడులో బాలు మహేంద్ర మెచ్చిన తెలుగుపొన్ను. కన్నడ, మలయాళంలో 25 ఏళ్ల క్రితమే హీరోయిన్‌. భాష ఏదైనా, ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతారు. ఆమే ఈశ్వరీరావు. సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. 1990లో 'ఇంటింటా దీపావళి' చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌తో నటించిన 'రాంబంటు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్‌స్టోరీ' చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఆ సినిమా విడుదల అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఆ సందర్భంగా తానెప్పుడూ నల్లగా ఉన్నానని బాధ పడలేదని చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఆమె సినీ ప్రస్థానం గురించి అనేక ఆసక్తికర విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె గురించిన మరిన్ని విశేషాలు..!

అసలు పేరు : ఈశ్వరీ రావు
ఇతర పేర్లు : జనని, విజయశ్రీ, వైజయంతి
పుట్టిన తేదీ : జూన్‌ 13, 1973
పుట్టిన ప్రాంతం : తణుకు, పశ్చిమగోదావరి
నివాస ప్రాంతం : చెన్నరు
హాబీస్‌ : షాపింగ్‌, ట్రావెలింగ్‌
భర్త పేరు : ఎల్‌. రాజా (డైరెక్టర్‌)
పిల్లలు : ఒక కుమార్తె, కుమారుడు
సోదరి : మానసారావు

ఈశ్వరీరావు మన తెలుగింటి అమ్మాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 'సినీ ఇండిస్టీలోకి సరైన సమయంలో నేను రాలేదు. ఇక్కడ శరీరఛాయ చాలా కీలకం అనేది ముందుగా తెలియదు. వాణిశ్రీ, సరిత, భానుప్రియలాంటి హీరోయిన్‌లకు అప్పట్లో శరీరఛాయ పెద్ద అడ్డంకి కాలేదు. కేవలం వారిలోని టాలెంట్‌ను మాత్రమే చూశారు. మా జనరేషన్‌లో ముంబై నుంచి హీరోయిన్లు వస్తుండేవారు. అయినా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నా. నేనెప్పుడూ నల్లగా ఉన్నానని ఏడవలేదు. 12 సంవత్సరాలు హీరోయిన్‌గా రాణించా. తర్వాత టీవీ రంగంలోకి వెళ్లాలి అనిపించింది. పదేళ్లు బుల్లితెరను ఏలానంటే అతిశయోక్తి కాదేమో! అప్పట్లో నటించిన 'నిన్నే పెళ్లాడతా, కస్తూరి, అగ్నిసాక్షి'లాంటి సీరియల్స్‌ అన్నీ సూపర్‌ హిట్‌. తర్వాత కొత్త డైరెక్టర్స్‌ రావడం చెప్పిన డైలాగే పదేపదే చెప్పించడం నచ్చలేదు. బుల్లితెర నుంచి బయటకు వచ్చేశాను. కొంతకాలం కేవలం ఇంటికే పరిమితమయ్యాను. మరలా తెలుగులో మహేష్‌బాబు బ్రహ్మోత్సవంలో చేశాను. నాలుగు సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు' అని చెప్పుకొచ్చారు.
తల్లిపాత్ర ఇస్తారేమోనని భయపడ్డా..!

 

నల్లగా ఉన్నానని బాధలేదు


    'ఫీల్డ్‌ వదిలేద్దాం అనుకుంటున్న సమయంలో అనుకోకుండా 'కాలా' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అందులో ఒక పాత్ర కోసం సంతకం చేయించుకున్నారు. కానీ నా పాత్ర ఏమిటో ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. రజనీకాంత్‌ తల్లి పాత్ర పోషించమంటారేమోనని చాలా భయపడ్డా. చివరకు ఒకరోజు రజనీకాంత్‌ భార్యగా మీరు ఈ చిత్రంలో నటిస్తారని చెప్పారు. అలా 13 సంవత్సరాల తర్వాత మరలా హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అయితే అది డీగ్లామరైజ్డ్‌ పాత్ర అని, కొన్ని నెలలు బ్యూటీపార్లర్‌కు వెళ్లకూడదని డైరెక్టర్‌ చెప్పారు. నేను ఉన్న రంగు కన్నా మరింత నల్లగా కనిపించాలన్నారు. అందుకోసం ప్రతిరోజూ కొంత సమయం ఎండలో నిలబడేదాన్ని. తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచిపేరు వచ్చింది' అంటోంది ఈశ్వరీరావు.
మేమంతా షాక్‌..!
     'లవ్‌స్టోరీ' చిత్రంలో ఆమె అయితే తల్లి పాత్రకు న్యాయం చేస్తుంది అనిపించింది. అందుకే ఆమెను ఫోన్‌ ద్వారా అప్రోచ్‌ అయ్యాను. క్యారెక్టర్‌ గురించి వివరించి, ఆడిషన్స్‌ కోసం రమ్మన్నాను. మరుసటి రోజు రూ.80 చీర కట్టుకుని, క్యారెక్టర్‌లో ఆడిషన్స్‌కి వచ్చేశారామె. మేమంతా షాక్‌ అయ్యాం. అంత డెడికేషన్‌ ఉన్న నటి ఈశ్వరీరావు' అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకులు శేఖర్‌ కమ్ముల చెప్పుకొచ్చారు. అప్పట్లో బాపుగారి దర్శకత్వంలో నటించిన 'రాంబంటు' సినిమా ఆమెకెంతో పేరు తెచ్చింది. ప్రస్తుతం ఈశ్వరీరావు అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. రజనీకాంత్‌ 'కాలా' చిత్రం తర్వాత 'అల వైకుంఠపురము, అరవింద సమేత, నేను లోకల్‌'లో నాని తల్లిగా హాస్యభరిత పాత్ర పోషించి, శభాష్‌ అనిపించుకున్నారు. 'కాలా' చిత్రంలో తన రోల్‌ చూసి, శేఖర్‌ కమ్ముల ఈ అవకాశం ఇచ్చినట్లు ఆమె చెబుతున్నారు.
     'ఈ రోజుల్లో సెట్‌లో సహనటుల మధ్య పెద్దగా సంభాషణలు జరగవు. అప్పట్లో షాట్‌ తర్వాత బ్రేక్‌లో చాలా విషయాల గురించి చర్చించేవాళ్లం. కనీసం 14 మందిమి కూర్చుని ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడా కనబడదు. కారవాన్‌లో కూర్చుని, కేవలం షాట్‌ సమయానికి మాత్రమే బయటకు వస్తున్నారు. విలువలు, సంబంధాలు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. హెచ్చు తగ్గులు లేకుండా ఏ రంగం ఉండదు. సినిమా కెరీర్‌ ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని చెప్పను. అందుకే దేనినీ సీరియస్‌గా తీసుకోను. టెలివిజన్‌, సినిమా పరిశ్రమలు రెండు విభిన్న ప్రపంచాలు!' అంటారు ఈశ్వరీరావు.