
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రైతుల వద్ద పంటను నమ్మకంగా కొనుగోలు చేసి ఆ తర్వాత డబ్బులివ్వకుండా మోసం చేస్తున్న వ్యాపారుల సంఖ్య గుంటూరు, పల్నాడు జిల్లాల్లో క్రమంగా పెరుగుతోంది. రైతుల వద్ద పంటను కొని సొమ్ము ఎగవేతకు పాల్పడిన పలువురి ఉదంతం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం చట్టుబడితండాకు చెందిన బాలాజీ నాయక్ దొడ్లేరులో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు. అయితే వారికి ఇవ్వాల్సిన రూ.30 లక్షలను బాలాజీనాయక్ ఎగవేశారు. దీంతో రైతులు సోమవారం స్పందనలో పల్నాడు ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. బాలాజీనాయక్ క్రోసూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కొని పిడుగురాళ్లలోని ఒక మిల్లుకు విక్రయించాడు. మిల్లరు వద్ద రూ.30 లక్షలు సొమ్ము తీసుకుని వాటిని రైతులకు ఇవ్వకుండా ముఖంచాటేశాడు. రైతులు ఫోన్ చేసి అడిగితే 'నేను ఐపి పెడుతున్నా.. మీఇష్టం వచ్చింది చేసుకోండి..' అని దురుసుగా మాట్లాడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. 30 మంది రైతుల నుంచి 1800 బస్తాల ధాన్యాన్ని బాలాజీనాయక్ కొనుగోలు చేసి గత 40 రోజులుగా డబ్బు ఇవ్వకుండా అదిగో..ఇదిగో అంటూ తిప్పుతూ ఇప్పుడు గ్రామం నుంచి ఉడాయించాడు.
పొన్నూరు మండలం మునిపల్లె, దండమూడి, మామిళ్లపల్లికి చెందిన రైతులు దాదాపు 30 మంది రైతులు సోమవారం గుంటూరులో ఎస్‌పిని కలిశారు. మునిపల్లెలోని శ్రీసీతారామ రైసు మిల్లు వారికి ధాన్యం విక్రయించగా ఇంత వరకు తమకు సొమ్ము ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది నుంచి చెల్లించాల్సిన బకాయిలు రూ. 3కోట్ల వరకు ఉన్నాయని, కొన్ని నెలలుగా ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వట్టికూటి రామ రాయలు, వట్టికూటి సత్యసాయిబాబు, వట్టికూటి రామనారాయణ తమ సొమ్ము ఇవ్వకుండా ఊరు విడిచి వెళ్లినట్టు రైతులు వాపోయారు. అయితే వ్యాపారులు తమకు అనుకూలంగా ఉన్నవారికి చెల్లించి మిగతా వారికి ఇవ్వడం లేదని ఎస్‌సి, ఎస్‌టి రైతులు వాపోయారు. తమను కులం పేరుతో మాట్లాడుతూ బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రావాల్సిన రూ.3 కోట్ల సొమ్ము ఇప్పించాలని వారు ఎస్‌పిని కోరారు.
మరోవైపు తమ వద్ద పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు సొమ్ము చెల్లించలేదని నల్లపాడులోని శ్రీనివాసా కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద సోమవారం రైతులు ధర్నా చేశారు. రైతులను వ్యాపారులు మోసం చేశారంటూ శ్రీనివాసా కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల ధర్నా నిర్వహించారు. గత రెండు నెలల నుండి సుమారు రూ.70 లక్షల వరకు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకు ధర్నా ఆపేది లేదన్నారు. పత్తి వ్యాపారి మేడా వాసు మోసం చేశాడంటూ మిల్లు వద్ద రైతులు నిరసన తెలిపారు. ఈ పత్తి మిల్లును అద్దెకు తీసుకుని వేరే వ్యక్తి చేత రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయించినట్టు రైతులు తెలిపారు. పెదకూరపాడు, అమరావతి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, క్రోసూరు, సత్తెనపల్లి, మేడికొండూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల రైతులు వద్ద పత్తిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాళ్ రూ.9 వేలు కొనుగోలు చేసిన వ్యాపారులు తమకు సొమ్ము చెల్లించడం లేదని ఎవరికి చెప్పుకోలేక గత్యంతరం లేని పరిస్థితిలో ధర్నాకు దిగినట్టు తెలిపారు. రెండు నెలలుగా డబ్బులు ఇస్తామంటూ ఇబ్బందిపెడుతున్నట్టు తెలిపారు. తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి వ్యాపారి నరేంద్ర కిడ్నాప్ కేసులో అరెస్టయిన బర్మా వెంకట్రావు నుంచి తమకు రావాల్సిన పైకం ఇప్పించాలని గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు రెండు రోజుల క్రితం నగరపాలెం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన విషయం తెలిసిందే. ఇలా జిల్లాలో పత్తి, మిర్చి, ధాన్యం రైతులను వ్యాపారులు ఎదో రూపంలో మోసం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అధికారులు సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉంది.