Nov 22,2022 21:08

రైల్వే జిఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌కు పూలబొకే అందజేస్తున్న ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి

నంద్యాల-తిరుపతికి రైలు అభినందనీయం
- ఎంపి పోచా, ఎమ్మెల్యే శిల్పా
- రైల్వే జిఎం దృష్టికి పలు సమస్యలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      నంద్యాల నుండి తిరుపతికి రైలు రాకపోకలకు అనుమతి ఇవ్వడం అభినందనీయమని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించేందుకు వచ్చిన రైల్వే జిఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతికి ట్రైన్‌ వేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి చొరవతో తిరుపతికి ట్రైన్‌ వేశారని, ప్రతిరోజు తిరుపతికి వెళ్లే ట్రైన్‌ ప్రజలతో రద్దీగా వెళ్తుందని, ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే తిరుపతిలో దాదాపు 8 గంటల వరకు ఖాళీగా ఉంటుందని, అందువల్ల తిరుపతి నుండి చెన్నై వరకు కొనసాగిస్తే బాగుంటుందని రైల్వే జిఎంను కోరారు. అందుకు జిఎం సానుకూలంగా స్పందించినట్లు శిల్పా తెలిపారు. నంద్యాల పట్టణంలోని మూలసాగరం, నూనెపల్లె, పొన్నాపురం గేట్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గించడం కోసం అండర్‌ గ్రౌండ్‌ పనులు అడిగామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.