Jan 14,2022 20:40
  • దిగ్భ్రాంతి చెందానను ఎన్‌సిడబ్ల్యు ఛైర్‌పర్సన్‌

న్యూఢిల్లీ : నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడు రోమన్‌ కేథలిక్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ను నిర్దోషిగా కేరళ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు పేర్కొంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ తీవ్రంగా స్పందించారు. బాధితురాలికి మద్దతు ప్రకటించారు. ''కోర్టు తీర్పు విని దిగ్భ్రాంతికి గురయ్యా, ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించాలి.'' అని ట్వీట్‌ చేశారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో బాధితురాలి వెన్నంటే మహిళా కమిషన్‌ వుంటుందని స్పష్టం చేశారు. 2018 జూన్‌లో కొట్టాలయం జిల్లాలో బిషప్‌పై అత్యాచారం కేసును నమోదు చేశారు. 2014 నుండి 2016 మధ్య కాలంలో ఫ్రాంకో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 2018 సెప్టెంబరులో బిషప్‌ని అరెస్టు చేసింది. అక్రమంగా నిర్బంధించడం, అత్యాచారం తదితర అభియోగాలను బిషప్‌పై మోపింది. 2019 నవంబరులో ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. జనవరి 10న ముగిసింది.