Jul 28,2021 18:54

'మాల్స్‌, పబ్బులకు వెళ్లి మాస్కులు తీసి ఎంజారు చేసే వాళ్ల కంటే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్లే సురక్షితం!' అంటూ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యదేవ్‌ - ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన 'తిమ్మరుసు' ప్రమోషనల్‌ కార్యక్రమంలో నాని పైవిధంగా కామెంట్‌ చేశారు. ఇంకా 'చాలామంది పబ్బులు క్లబ్బులు మాల్స్‌కి వెళ్లి మాస్కులు తీసేసి మాట్లాడుతున్నారు. దానికంటే థియేటర్లలో కూచున్న ప్రేక్షకులు చాలా సురక్షితం. మాస్క్‌ రూల్‌ ని పాటిస్తూ ఒకేవైపు అంటే తెరవైపు మాత్రమే చూస్తారు. పక్కవాళ్లతో మాట్లాడరు. కానీ కరోనా వస్తోందని.. అన్నింటి కంటే ముందు థియేటర్లు మూసేసి, చివరిలో తెరుస్తున్నారు. అన్నింటితో పాటే వీటినీ తెరవొచ్చు కదా! పరిస్థితి ఇలానే ఉంటే థియేటర్ల వ్యవస్థ నాశనం అవుతుంది. లక్షలాది కార్మికులు రోడ్డున పడతారు. ఉపాధి పోయింది. థియేటర్లో సినిమా చూడటం మన సంస్కృతిలో భాగం. ఇంట్లో, ఆ తర్వాత థియేటర్లలోనే ఎక్కువగా గడిపాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని ఆస్వాదిద్దాం. థర్డ్‌ వేవ్‌ లాంటివి రాకుండా.. అన్ని సినిమాలను థియేటర్‌లలో కలిసి ఆస్వాదించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.