Oct 05,2022 11:05

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో దసరా సెలవుల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్నటువంటి హాకీ, బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ లలో కోచింగ్ కి వచ్చే పిల్లలతో పాటు స్థానిక ఎస్సై వెంకటప్రసాద్ కూడా ప్రతిరోజు ఉదయం పిల్లలతో కలిసి హాకీ బ్యాడ్మింటన్ ఆడుతూ విద్యార్థుల్లో ఎస్ఐ క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు చాలా అవసరమని చదువు సంస్కారాన్ని నేర్పితే క్రీడలు విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఇస్తాయని తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కులు రావాలంటూ చదువు, చదువు అని పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదని పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో మానసిక ఉల్లాసం కూడా అంతే అవసరమని అన్నారు. మండల ఎస్ఐగా ఎన్ని పనులు ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్న విద్యార్థుల కోసం సమయం కేటాయించి క్రీడా మైదానానికి వచ్చి ఉదయం పిల్లలతో ఆటలాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతున్న వైనాన్ని పలువురు సీనియర్ క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక శిక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.