Oct 18,2020 23:11

సంతబొమ్మాళిలో నీట మునిగిన వరి పంట పొలాలు(ఫైల్‌)

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ప్రభుత్వం తీసుకొచ్చిన పంట సాగుహక్కుదారుల చట్టం-2019తో కౌలు రైతులకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోంది. భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా ఎటువంటి ప్రయోజనాలు దక్కడం లేవు. భూ యజమానికే ఎరువులు, విత్తనాల సబ్సిడీ దక్కుతోంది. బ్యాంకు రుణాలు కూడా వారికే వస్తున్నాయి. అన్ని రకాలుగా నష్టపోవడం కౌలు రైతుల వంతు అయ్యింది. వాయుగుండం ప్రభావంతో కౌలు రైతులు పంటలు కోల్పోయినా ఆ పరిహారం వారికి వచ్చేలా లేదు. యజమాని ఖాతాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి నష్టపరిహారానికీ నోచుకోలేకపోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ప్రసుత్త ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి 5,36,67.5 ఎకరాల్లో సాగయ్యాయి. వరి 4,80,572.2 ఎకరాల్లో సాగైంది. ఇందులో కౌలు రైతులే దాదాపు రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనాగా ఉంది. వాయుగుండం ప్రభావంతో వేలాది ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక నివేదిక ప్రకారం వ్యవసాయ పంటలు 4,911.45 ఎకరాలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. అందులో వరి 4,853.95 ఎకరాల్లో, మొక్కజొన్న 57.5 ఎకరాల మేర నష్టం వాటిల్లింది. కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు 190 ఎకరాల మేర దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల్లో సగం విస్తీర్ణంలో కౌలు రైతుల సాగులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇ-క్రాప్‌లో భూయజమాని పేర్లు నమోదు
భారీ వర్షాలతో పంట నష్టపోయిన వారికి పరిహారం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టపరిహారం పొందాలంటే ఇ-క్రాప్‌లో నమోదై ఉండాలి. భూమి, పంట వివరాలు యజమాని పేరుతోనే ఉండటంతో కౌలు రైతుకు కష్టమే మిగలనుంది. భూ యజమానికి పరిహారం దక్కనుంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పంట సాగు హక్కుదారుల చట్టం-2019ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలంటే భూ యజమాని రాత పూర్వక అగ్రిమెంటు తీసుకోవాలి. అధికశాతం మంది భూ యజమానులు ససేమిరా అనడంతో గుర్తింపు కార్డులకు నోచుకోలేకపోయారు. భూ యజమాని సంతకం చేస్తే, కౌలుదారునికి సొంతమైపోతుందని, లేనిపోని సమస్యలు తలెత్తుతాయని భూయజమానులు అంగీకరించని పరిస్థితి నెలకొంది. భూయజమానులకు అవగాహన కల్పించి, భరోసానివ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో వేలాది మంది కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు, పంట నష్ట పరిహరం దూరమవుతున్నారు.
కష్టమే మిగిలేలా ఉంది
నేను మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని చెరుకు వేశాను. ఇప్పటివరకు రూ.30 వేలు ఖర్చు చేశాను. వర్షాలతో చెరుకు పంట దెబ్బతింది. ఇ-క్రాప్‌లో నా పేరు నమోదు కాకపోవడంతో నష్ట పరిహారం రాదంటున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం రాకపోగా కౌలు ఒప్పందం ప్రకారం భూ యజమానికి రూ.15 వేలు చెల్లించాలి. కష్టమే మిగిలేలా ఉంది.
-శాసపు రాము, వైపర్త, బూర్జ మండలం
అప్పులు చేసి మదుపులు పెట్టాను

నేను 1.80 ఎకరాల్లో వరి, 1.20 ఎకరాల్లో చెరుకు పంట వేశాను. ప్రభుత్వం సిసిఆర్‌సి కార్డులు ఇవ్వకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. బయట అప్పులు చేసి మదుపులు పెట్టాను. వర్షాలతో 40శాతం మేర పంట నీటిలో మునిగిపోయింది. కౌలు రైతు కావడంతో ఇ-క్రాప్‌లో నా పేరు నమోదు చేయలేదు. అన్ని రకాలుగా నష్టపోయాను.
-ఇప్పిలి నారాయణరావు, అంపిలి, బూర్జ మండలం