May 15,2022 08:34
Aishwarya-Rajesh

సినీ ప్రపంచానికి నటీమణులు గ్లామర్‌ చూపించి ఇంప్రెస్‌ చేయడానికి మాత్రమే కాదు.. కొందరు తమ యాక్టింగ్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికీ వస్తారు. అలాంటి వారిలో ఒకరు ఐశ్వర్య రాజేష్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 'రాంబంటు' చిత్రంలో మొదటిసారి మెరిశారు ఐశ్వర్య. 'నీతానా అవన్‌' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తమిళంలోనే పలు హిట్‌ సినిమాల్లో నటించిన ఐశ్వర్య వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే 'పాత్ర నిడివి తక్కువైనా సరే నటనకి ప్రాధాన్యం ఉన్న కథల్నే ఎంపిక చేసుకుంటా.. సినిమా ఫలితాన్ని పక్కనపెడితే నేను పోషించిన పాత్ర అందరికీ చేరువవ్వాలి' అంటున్నారు ఐశ్వర్య. తాజాగా 'డ్రైవర్‌ జమున' పేరుతో మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన కొన్ని విశేషాలు..

Aishwarya-Rajesh


తమిళ సినీ పరిశ్రమ నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన నటి ఐశ్వర్య రాజేష్‌. తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలని చూస్తున్నారు. 'కౌశల్య కృష్ణమూర్తి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య.. ఆ తర్వాత 'మిస్‌ మ్యాచ్‌', 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌', 'టక్‌ జగదీష్‌', 'రిపబ్లిక్‌' సినిమాల్లో నటించారు. అయితే, 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లో సువర్ణ పాత్ర ఐశ్వర్య రాజేష్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సువర్ణ పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు ఐశ్వర్య. ఫెర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా ఆమె క్యాబ్‌ డ్రైవర్‌ అవతారం ఎత్తారు. రాజేష్‌ కిన్‌ స్లిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'డ్రైవర్‌ జమున' అనే పేరును ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
ఎన్నో ఇబ్బందులు పడ్డా..
ఇదిలా ఉంటే, తాను నటిగా ఎదగడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య వెల్లడించారు. తన చిన్నతనం గురించి, సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఐశ్వర్య చెప్పుకొచ్చారు. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమని, చెన్నరులోని ఒక హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో తాను పెరిగానని ఐశ్వర్య చెప్పారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారని, ఆ తర్వాత తనతోపాటు నలుగురు సంతానాన్ని తల్లి ఎంతో కష్టపడి పోషించారని వెల్లడించారు. పెద్దగా చదువుకోని తన తల్లి తమను పెంచడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు.
నా కలలు అక్కడితో ఆగిపోలేదు..
సినిమాలకు ముందు 'ఒక సూపర్‌ మార్కెట్‌ ముందు చాక్‌లెట్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసేదాన్ని. అదే నా మొదటి ఉద్యోగం. 11వ తరగతి చదివేటప్పుడు జాబ్‌లో జాయినయ్యాను. రూ.225 జీతంగా ఇచ్చేవారు. కానీ, నా కలలు అక్కడితో ఆగిపోలేదు. టీవీ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేశాను. ఒక పాపులర్‌ డాన్స్‌ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచాను. అయితే, సినిమా బ్యాగ్రౌండ్‌ ఉన్న నటులకే టీవీ సీరియల్స్‌లో పారితోషికాలు కచ్చితంగా ఇచ్చేవారు. అందుకే, ముందు నేను సినిమాల్లోకి అడుగుపెట్టాను' అని ఐశ్వర్య వివరించారు. నిజానికి ఐశ్వర్య తండ్రి రాజేష్‌ అప్పట్లో తమిళ చిత్రాల్లో నటించారు. అలాగే, నటి శ్రీలక్ష్మికి ఐశ్వర్య స్వయానా మేనకోడలు.
ఆ లక్షణమే నన్ను నిలబెట్టింది..
సినిమాల్లో తన ప్రయాణం సాఫీగా సాగలేదని ఐశ్వర్య వెల్లడించారు. అన్ని రకాల అడ్డంకులనూ తాను అధిగమించానన్నారు. 'నా కెరీర్‌ ఆరంభంలో లైంగిక వేధింపులతో పాటు వర్ణ వివక్షనూ ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్‌ మెటీరియల్‌ కాదని ఓ స్టార్‌ డైరెక్టర్‌ కించపరచే విధంగా మాట్లాడారు. కమెడియన్‌ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్‌ అవ్వననీ అన్నారు. ఆ అవమానాలేవి నన్ను ఆపలేదు. నేను బోల్డ్‌గా ఉంటాను. ఆ లక్షణమే నన్ను నిలబెట్టిందను కుంటాను. సమస్యల్ని స్వీకరించడం నాకు తెలుసు. ఎవరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను నమ్మాను. అందుకే బాధల్ని ఓర్చుకున్నాను' అని ఇండిస్టీలో తనకు ఎదురైన అనుభవాలను ఐశ్వర్య చెప్పుకొచ్చారు.
బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా..
ఐశ్వర్య రాజేష్‌ 'డ్రైవర్‌ జమున' పాత్ర కోసం చాలా మంది లేడీ క్యాబ్‌ డ్రైవర్లని కలసి, వారి బాడీ లాంగ్వేజ్‌ తగ్గట్టు నేచురల్‌గా ఈ పాత్రకు సిద్ధమయ్యారు. ఇలాంటి చిత్రాలు బ్లూ మ్యాట్‌ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తారు. అయితే ఐశ్వర్య ప్రతి ఒక్క షాట్‌ ఎటువంటి డూప్‌ లేకుండా నటించారట! తన పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉండేలా స్వయంగా రోడ్లపై కారుని నడిపారట!!

పేరు : ఐశ్వర్య రాజేష్‌
ఇతర పేర్లు : ఐషు
పుట్టిన తేదీ: 1990, మార్చి 10
పుట్టిన ప్రాంతం : చెన్నరు
చదువు : బికామ్‌
తల్లిదండ్రులు : రాజేష్‌, నాగమణి