Jul 03,2022 22:22

ప్రజాశక్తి-కాకినాడ, కాకినాడ రూరల్‌ ఏ తరం నటులకైనా ఎస్‌వి రంగారావు మార్గదర్శిగా నిలుస్తారని డాక్టర్‌ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక నాగమల్లి తోట జంక్షన్‌ వద్ద ఉన్న ఎస్‌వి.రంగారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాకినాడ వైద్యులు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగు వారు గర్వించదగ్గ మహానటుడు ఎస్వీఅర్‌ అన్నారు. ఏ తరం నటులైనా ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. డాక్టర్‌ అడ్డాల మాట్లాడుతూ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి నటనలో ఎస్‌విఆర్‌ పెద్దబాలశిక్ష లాంటి వారని, నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారన్నారు. 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్లల్లో ఒకటి రంగారావు పేరు మీద విడుదలయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ వీరభద్రరావు, డాక్టర్‌ రాజ్‌ కుమార్‌, డా. దొరబాబు, డా. ఫణి పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ భారీ విగ్రహంతో, విలక్షణమైన వాచకంతో ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగి పరకాయ ప్రవేశం చేసే అద్భుతమైన నటుడు రంగారావు అని విశ్రాంత తహశీల్దారు రేలంగి బాపిరాజు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌లో బోట్‌ క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో రంగారావు జయంతి ఘనంగా నిర్వహించారు. బాపిరాజు మాట్లాడుతూ స్వయంసిద్ధమైన నటనే గాని ఎవరిని ఆయన ఎన్నడూ అనుకరించలేదని అన్నారు. కంటి చూపుతో, చేయి కదలికతో, పెదవి విరుపుతో పాత్రకు తగ్గట్టు హావభావాలు పలికిస్తూ నటించిన గొప్ప నటుడన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సువర్ణ రాజు, అడబాల రత్నప్రసాద్‌, కుమార్‌ యాదవ్‌, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.