Aug 09,2022 20:34
  • కనీస వేతన స్కేలు అమల్జేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ జెఎసి డిమాండ్‌ చేసింది. లేదంటే ఈ నెల 29వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. వైద్యారోగ్యశాఖ కమిషనరు, ఎన్‌హెచ్‌ఎం ఎమ్‌డికి జెఎసి ఛైర్మన్‌ డి దయామని, కన్వీనరు సిహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం నోటీసు అందించారు. 2022 జనవరి నుంచి ఎంటిఎస్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని జరుగుతున్న తీవ్ర జాప్యంపై నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీన సిఎం చిత్రపటానికి రక్షాబంధన్‌ కట్టి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. 14న జిల్లాల్లో అనిు ఉద్యోగ సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి తమ పోరాటానికి మద్దతు కోరతామనాురు. 22న సామూహిక సెలవు పెట్టి కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు. ఈ నెల 29 తర్వాత ఏ క్షణం నుంచైనా విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 11వ పిఆర్‌సి ప్రకారం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఈ ఏడాది జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. సిఎం హామీ మేరకు ఒకే కేడర్‌-ఒకే వేతనం, సమాన పనికి-సమాన వేతనం అమలు చేయాలని ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారులకు వివిధ రూపాల్లో వినతిపత్రాలు అందించామన్నారు.