2028 వరకు కొనసాగేందుకు కేంద్రం అనుమతి
ఎన్నికల ముందు వెనక్కి తగ్గిన బిజెపి : కాంగ్రెస్ విమర్శ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అగ్నిపథ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకుని 2026లో సైన్యం నుంచి బయటకు వెళ్లాల్సిన అగ్నివీరుల్లో 75 శాతం మందికి మరో రెండేళ్ల పాటు సర్వీసును పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో మొదటి విడతలో నియమితులైన అగ్నివీరులు 2028 వరకు సైన్యంలో కొనసాగేందుకు అవకాశం కలిగింది. అయితే ఆ తరువాత కూడా సాధారణ సైనికులుగా శాశ్వత నియామకం పొందడం ఎంపిక ప్రమాణాలకు లోబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 2022 జూన్ 14న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ప్రకారం సైన్యంలో నియమితులైన అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీసు మాత్రమే ఉంటుంది. వీరిలో 25 శాతం మందిని మాత్రమే ప్రతిభ, ఇతర ఎంపిక ప్రమాణాల ఆధారంగా సాధారణ సైనికులుగా కొనసాగిస్తారు. మిగిలిన 75 శాతం నాలుగేళ్ల అనంతరం సైన్యం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ విధానంపై దేశవ్యాప్తంగా యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యోగ భద్రత, పెన్షన్ సదుపాయాలు, భవిష్యత్తు ఉపాధిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
తొలి విడతలో నియమితులైన 18,300 మందికి పైగా అగ్నివీరులు 2026 డిసెంబరు 31 నాటికి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని బయటకు వెళ్లాల్సి ఉంది. వీరి సర్వీసు ముగింపు ప్రక్రియ ఈ నెల నుంచే దశలవారీ ప్రారంభం కావాల్సి ఉంది. తాజా నిర్ణయంతో వీరిలో 75 శాతం మందికి మరో రెండేళ్ల సర్వీసు అవకాశం లభించనుంది. ఈ అదనపు కాలంలో అధిక వేతనం కూడా చెల్లించనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రహ్మణి వెల్లడించారు. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన తరువాత సైన్యంలో కొనసాగాలని ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత ఎంపిక ప్రమాణాల ప్రకారం సాధారణ సైనికులుగా చేరేందుకు మరో అవకాశం కూడా పొందుతారని తెలిపారు. అయితే శాశ్వత నియామకం ఆటోమెటిక్‌గా లభించదని స్పష్టం చేశారు.
ఎన్నికల కోసమే నిర్ణయం : కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు. సైనిక నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఉన్న ఈ రాష్ట్రాల్లో యువత అసంతృప్తిని చల్లార్చేందుకు బిజెపి ఎన్నికల ముందు తన వైఖరిని మార్చుకుందని ఆరోపించారు. ఆ పార్టీకి భారతీయ జనతా పార్టీ బదులు ‘భారతీయ జనతా పల్టీ’ అని పేరు పెట్టాలని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకం నిలకడలేనిదని, దానివల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని రాహుల్‌గాంధీ గతంలోనే హెచ్చరించారని, తాజా నిర్ణయం ఆయన వ్యాఖ్యలు సరైనవేనని మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)