Jun 20,2022 07:00

'డా. కుప్పం రామలక్ష్మి' తెలుగు సాహిత్యలోకంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఒక పక్క డాక్టరుగా వైద్యసేవలు అందిస్తూనే మరోపక్క తన తల్లి కుప్పం రెడ్డెమ్మ గారి మీద ఉన్న ఎనలేని ప్రేమ గౌరవ భావాల తోటి ఆమె పేరు మీద 1993లో 'కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు' నెలకొల్పి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్‌ 12వ తారీఖున అంటే రెడ్డెమ్మ గారి వర్ధంతి రోజున చిత్తూరు పట్టణంలో సాహితీ కార్యక్రమం నడుపుతూ, 2013లో 'కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం' నెలకొల్పి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఎందరో కవులూ రచయితల్ని నగదు బహుమతితో బాటు సన్మానిస్తున్నారు. ఆమె కలం నుంచి అనివార్యంగా వెలువడ్డ రచన 'ఓ తల్లి ఆమె తనయ'. సాధారణంగా రచయితలు రాస్తే జీవిత చరిత్ర రాస్తారు. లేదంటే ఆత్మకథ రాస్తారు. ఐతే డా. కె.రామలక్ష్మి రాసిన ఈ రచన కొంతవరకూ తన తల్లి కుప్పం రెడ్డెమ్మ కథని చెప్పి, ఆ తర్వాత తమ ఇద్దరి జీవితగాథని పెనవేసి అల్లడం వల్ల అది కొంతమేరకు జీవిత చరిత్రలా సాగి, ఇంకో విధంగా ఆత్మకథలా నడుస్తుంది. ఈ కొత్త ప్రక్రియని 'జీవిత చరిత్రాత్మకథ' అని చెప్పుకోవచ్చు. అలా రామలక్ష్మి గారు ఒక నూతన సాహిత్య ప్రక్రియని సృజించినవారయ్యారు. ఆమె తను రచయితని కాదని అంటూనే గొప్ప సృజన చేశారు. ఐతే ఈ రచన కేవలం జీవితచరిత్రగానో, లేదా ఆత్మకథగానో మిగిలిపోయి ఉంటే దాని ప్రత్యేకత అంతగా ఉండేది కాదేమో. అది ఒక సలక్షణమైన నవలగా రూపుదిద్దుకున్నది. అందుకే 'ఓ తల్లి ఆమె తనయ' చర్చనీయమైంది.
       ఓ తల్లి ఆమె తనయ చదువుతుంటే మనముందు ఒక నాటక ప్రదర్శన జరుగుతున్నట్టు, ఒక సినిమాని చూస్తున్నట్టూ అనుభవం కలుగుతుంది. ఇది మొదట మగదిక్కుని కోల్పోయిన మంగమ్మ, రెడ్డెమ్మ అనే ఇద్దరు స్త్రీమూర్తుల జీవనయాత్ర. ఆపై రెడ్డెమ్మ, రమాదేవి అనే ఇద్దరు ఆడకూతుళ్ళ విజయగాథ. ఇందులో ఒకనాటి సమాజం, దాని ఆచార సంప్రదాయాలు, అందులో ఒంటరి స్త్రీల జీవితాలు, నాటి జనజీవితం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్‌ బిల్డింగ్‌, హేతువాదం, స్త్రీవాదం, కాలధర్మాన్ని అధిగమించి మూఢ నమ్మకాలు ఆచారాల నుంచి బయటపడ్డం, సమాజంలో పురుషాధిక్యత ఎలా ఉంటుందో గ్రహిస్తూ దాని బానిసత్వ భావజాలం నుంచి మెలమెల్లగా వెలుపలికి రావడం లాంటివి చోటు చేసుకుని పాఠకులకు రసానుభూతితో బాటు మానసిక పరివర్తన కలిగించే గుణం పుష్కలంగా ఉంది. ఈ రచనలో మంగమ్మ, ఆమె కూతురు రెడ్డి రాములమ్మ (కుప్పం రెడ్డెమ్మ), ఆమె కూతురు రమాదేవి (డా. కె. రామలక్ష్మి) ప్రధాన పాత్రలైనప్పటికీ కథానాయిక మాత్రం నిస్సందేహంగా కుప్పం రెడ్డెమ్మే. తన తల్లిని మరచిపోలేక ఎనలేని ప్రేమోద్వేగం తోటి ఆదర్శప్రాయమైన ఆమె జీవితాన్ని కథనం చెయ్యడానికే రచయిత్రి ఈ రచన చేశారు. ఇందులో కష్టాలున్నాయి. కన్నీళ్లున్నాయి. పాఠకులు అనేక సందర్భాల్లో నియంత్రణ కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటారు.
         చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని గర్నిమిట్ట, వగళ్ళ గ్రామాల వద్దగల వాకాటంపల్లెలో వారాదమ్మ కొడుకు గంగిరెడ్డి. ఆయనకు తమ పక్కపల్లె ఐన మినమరెడ్డిగారిపల్లెలోని తండ్రి లేని మంగమ్మని పెళ్ళి చేసుకుంటారు. ఆ దంపతులు మగబిడ్డ కావాలని ఎంత కోరుకున్నా రెడ్డెమ్మ, ఆదిలక్ష్మి, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలు మొత్తం నలుగురాడబిడ్డలు పుడతారు. భర్త చనిపోతే అతని ఆస్తిని భార్యకు ఆడబిడ్డలకు ఇవ్వకుండా దాయాదులు ఆక్రమించుకునే దుస్సంప్రదాయం రాజ్యమేలుతున్న రోజులవి. అందువల్ల భర్త చనిపోతే అతని ఆస్తిపాస్తులు అతని భార్యకు ఆడబిడ్డలకు చెందేలా కొత్తగా చట్టం వచ్చిందని కరణం ద్వారా తెలుసుకున్న గంగిరెడ్డి ఆ కరణం సాయంతోనే తన ఆస్తిని తన భార్య మంగమ్మ పేర రాయించి రికార్డులు భద్రపరచి అనారోగ్యంతో చనిపోతాడు. ఇక మంగమ్మ దాయాదుల్లో జీవించడం కష్టమని పుట్టిన ఊరు మినమరెడ్డిగారిపల్లె చేరుకుంటుంది. అక్కడ కూడా తన అన్నతో ఆస్తితగాదాలు వచ్చి మరింత ఆత్మరక్షణలో పడిపోతుంది. కష్టజీవి, ముక్కోపి ఐన మంగమ్మ తన బిడ్డల్ని పద్ధతిగా పెంచుకునే క్రమంలో కఠినమైన జీవన విధానాల్ని పాటిస్తుంటుంది. ఐనప్పటికీ తన తెలివితేటల ద్వారా అమ్మని ఒప్పించి రెడ్డెమ్మ బడికెళ్ళి ఐదవ తరగతి వరకూ చదువుకోగలుగుతుంది. తను కూడా ఇష్టపడిన వెంకట రమణ ఇంటి సంప్రదాయాలు సర్లేవని ఆ సంబంధం కాదంటుంది మంగమ్మ. తర్వాత నడింపల్లికి చెందినవాడు, చదువుకున్నవాడు, రెడ్డెమ్మ అంటే ఇష్టపడ్డవాడు ఐన క్రిష్ణారెడ్డికి రెడ్డెమ్మనిచ్చి పెళ్లి చేస్తుంది.
         రెడ్డెమ్మ, క్రిష్ణారెడ్డి ఆదర్శ దంపతులైనప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల క్రిష్ణారెడ్డి పేకాటకూ పొగతాగుడుకూ బానిసై అనారోగ్యం పాలై చనిపోతాడు. అప్పటికి వాళ్లకి కలిగిన ఏకైక సంతానం రమాదేవి అలియాస్‌ డా. కె.రామలక్ష్మి. ఇక అక్కడినుంచి రెడ్డెమ్మ ప్రయాణం మొదలవుతుంది. తన స్వాధ్యాయాన్ని కొనసాగిస్తుంది. పుస్తకాల ద్వారా పత్రికల ద్వారా తన జ్ఞానాన్ని పెంచుకుంటూ, హస్తకళలు నేర్చుకుంటూ, చిన్న చిన్న సంపాదనలు చేస్తూ అప్పులు తీర్చేస్తుంది. మొదట రమాదేవిని వాయల్పాడులో చదివిస్తుంది. తర్వాత తన దాయాదుల బిడ్డలతో బాటు తన కూతురు రమాదేవిని చదివిస్తూ పీలేరు, తిరుపతి, హైదరాబాదుల్లో జీవితం గడిపి కూతుర్ని మెడిసిన్‌ చదివించి డాక్టర్ని చేస్తుంది. డాక్టరు వృత్తిలో కూడా రామలక్ష్మి గారిని సృజనాత్మకంగా, నీతినిజాయితీగా మెలిగేలా తీర్చిదిద్దుతుంది. కానీ చివరికి తన స్వతంత్ర భావజాలంతో తీర్థయాత్రలు చేస్తూ ఆశ్రమాల్లో గడపాలని ప్రయత్నిస్తూ ఏర్పేడు ఆశ్రమంలో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై శ్రీకాళహస్తి ఆసుపత్రిలో చనిపోతుంది. అప్పటి నుంచి రామలక్ష్మి పుస్తకాల పురుగైన అమ్మ స్మరణలో సాహితీ కార్యక్రమాలు, దానధర్మాలు చేస్తూ గడుపుతున్నారు. ఇది టూకీగా ఓ తల్లి ఆమె తనయలో ఉన్న వాస్తవ కథ.
         మంగమ్మ, ఆమె కూతురు రెడ్డెమ్మల జీవితాల్ని తులనాత్మకంగా పరిశీలించవచ్చు. వాళ్ళ ఇద్దరి జీవితాలూ, వాటిలో వచ్చే మలుపులూ ఒకేలా ఉంటాయి. ఇద్దరూ తండ్రి మరణించగా తల్లి సంరక్షణలో పెరిగిన ఆడబిడ్డలు. ఇద్దరికీ భర్తలు చనిపోయి వైధవ్యం సంభవిస్తుంది. ఇద్దరికీ మానవ సంబంధాలతో పోరు చెయ్యాల్సి వస్తుంది. ఐతే నిరక్షరాస్యత, అవిద్యల వల్ల మంగమ్మ మానవ సంబంధాల్ని జఠిలం చేసుకుంటుంది. కానీ రెడ్డెమ్మ విద్యవల్లా, తన లౌక్యం వల్లా ఎంతో ఎదుగుతుంది. బంధుమిత్రులతో చక్కటి మానవ సంబంధాలను నెలకొల్పుకొంటుంది. దాన్ని తన బిడ్డ రమాదేవికీ అలవాటు చేస్తుంది. రెడ్డెమ్మ తల్లి మంగమ్మ మానసికస్థితి విభిన్నమైనది. ఆమెకు కోపం, విసుగూ ఎక్కువ. ఆమె యుక్త వయసులోనే భర్తని పోగొట్టుకోవడం, స్త్రీకి ఆస్తిహక్కుని నిరాకరించే పురుషాధిక్య ప్రపంచంలో తన మెట్టినింటి తరపు దాయాదులతోటి, పుట్టింటి తరపు తన అన్నతోటి అస్తిత్వ పోరాటం చెయ్యాల్సి రావడం, నలుగురు ఆడబిడ్డల్ని తప్పుదారిలో పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఒంటరిదైన తనమీదే పడ్డం లాంటి ఒత్తిళ్ళ వల్ల ఆమె అలా తయారై ఉండొచ్చు. దాన్ని రచయిత్రి ప్రతిభావంతంగా కథనం చేశారు.
         మనిషిలో పరివర్తనకు కూడా కాలపరిమితులు ఉంటాయి. మొదట తన తల్లి మంగమ్మ మానసిక స్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోయి ఒదిగి బతికిన రెడ్డెమ్మ ఆ తర్వాత తన కూతురు రమాదేవిలో వస్తున్న మార్పులను ఒకరకంగా చెప్పాలంటే జీర్ణించుకోలేకపోయింది. అంటే తన కాలానికి పరిమితమైన పరివర్తన స్థాయిలకే ఆమె పరిమితమైపోయింది. హేతువాద దక్పథాన్ని అలవరచుకున్న రమాదేవి ఇప్పటికీ దైవభక్తిని, భావవాదాన్ని దాటలేకపోతున్నారు. చిన్నతనం నుంచి తనలో ఇంకిపోయిన భావజాలానికి వ్యతిరేకమైన మార్పు బలమైన కారణాలు ఉంటేగాని ఒక్కసారిగా రాదు. దాన్ని పాఠకులు కూడా అర్థం చేసుకోగలరు. ఐతే వారి సంతానం, మనుమళ్ళ హయాంలో దాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. ఈ రచనలో రెడ్డి రాములమ్మ (కుప్పం రెడ్డెమ్మ)లో తండ్రి కూచితనాన్ని (ఒక విధమైన ఎలెక్ట్రా కాంప్లెక్సుని), రమాదేవి (డా. కె. రామలక్ష్మి)గారిలో అమ్మకూచితనాన్ని చూడొచ్చు.
      ఓ తల్లి ఆమె తనయ కథానాయికని ఇంటర్వ్యూ చేస్తూ రాసిన పరిశోధనాత్మకమైన జీవితచరిత్రగా కూడా అనిపిస్తుంది. జీవితచరిత్ర, ఆత్మకథ రాస్తున్నప్పుడు వాస్తవాలను దాచకుండా వెల్లడించడంలో నిజాయితీ, నిబద్ధతా ఉండాలి. రసాభాసా, అసభ్యతా చోటుచేసుకునేందుకు అవకాశం ఉన్న సందర్భాల్ని సభ్యమైన సంఘటనలుగా మలచగల ఒడుపూ ఓర్పూ నేర్పూ ఉండాలి. అవి ఇందులో పుష్కలంగా కనబడతాయి. తమ కుటుంబాల్లో వచ్చిన కష్టనష్టాలను, శారీరకమైన రోగాలను, వాటిని నయం చేసుకోడానికి చేసిన ప్రయత్నాలను, కుటుంబ సభ్యుల మానసిక బలహీనతల్ని, తమ పేదతనాన్ని, దానివల్ల బంధుమిత్రుల మధ్య పడ్డ అవమానాల్ని వెల్లడించడానికి రచయిత్రి ఏమాత్రం సంకోచించలేదు. తన తల్లి రెడ్డెమ్మ జీవితంలో మొదట ఇష్టపడిన వెంకట రమణతో పెళ్లి తప్పిపోవడాన్ని, అలాగే ఒంటరిదైన రెడ్డెమ్మని లోబరుచుకోవాలని చూసిన ఒకానొక రెడ్డి ఉదంతాన్నీ, రెడ్డెమ్మ చెల్లి, తన పిన్ని ఐన ఆదిలక్ష్మి ఆత్మహత్యని అక్షరీకరించడానికి వెనుకాడలేదు. తన వత్తినైపుణ్యలేమిని, వృత్తిధర్మాల్ని పాటించడంలో ఎరుక లేకపోడాన్ని, నిబద్ధత లేకపోడాన్ని, ఆయా సందర్భాల్లో తన తల్లి రెడ్డెమ్మ గారి హెచ్చరికలతో తాను మేల్కొని వృత్తిధర్మాలకు కట్టుబడడాన్ని, తల్లి కోరిక మేరకు తన వృత్తినైపుణ్యాల్ని పెంచుకోడానికి పడిన తపనని ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలివేయకుండా రచయిత్రి కథనం చెయ్యడం ఇందుకు నిదర్శనం. చివరకు ఆమె తన తల్లి రెడ్డమ్మ గారిని 'అమ్మా!... నాయన చనిపోయాక నీవు ఎప్పుడయినా ఏ మగవారిని అయినా చూసి మనసుపడ్డావా?' అని అడిగిన విషయాన్ని, అందుకు రెడ్డెమ్మ ఇచ్చిన ఆదర్శప్రాయమైన సమాధానాన్ని కూడా రాయడం జీవితచరిత్ర, ఆత్మకథ రచనలో రచయిత్రికి గల నిష్ఠకూ, నిబద్ధతకూ పరమ ప్రమాణం.
        కుప్పం రెడ్డెమ్మ చురుకైన వ్యక్తి. జీవితాంతం నేర్చుకునే గుణం కలిగిన జీవి. సాహిత్య పిపాసి. సాహసి. హస్తకళాభిమాని. పదిమంది మేలుగోరే మనిషి. అన్నింటికీ మించి మంచి మనిషి. అలాంటి వ్యక్తి జీవితాన్ని తప్పకుండా గ్రంథస్తం చెయ్యాలి. ఆ పనిని ఆమె తనయగా, దానికి తగిన అర్హతలున్న వ్యక్తిగా డా. కె. రామలక్ష్మి సమర్ధవంతంగా చేశారు. ఇక మిగిలింది పాఠకుల బాధ్యతే. అది ఈ పుస్తకాన్ని చదవడం. స్ఫూర్తిని పొందడం. అందువల్ల 'ఓ తల్లి ఆమె తనయ' మనిషికి, ముఖ్యంగా ఒంటరి మహిళలకి, తండ్రి ఆసరాలేని ఆడపిల్లలకి ఒక ధైర్యాన్నిచ్చే జీవితచరిత్రగా, ఒక నిజాయితీని నింపే ఆత్మకథగా, కష్టాలకు ఎదురీదుతూ కెరీర్‌ నిర్మాణం ఎలా చేసుకోవాలో చూపించే మనోవైజ్ఞానిక గ్రంథంగా, మానవ విలువలు నేర్పేదిగా, వృత్తికారులకు వృత్తిధర్మాల్ని నేర్పి, ఆ వృత్తిధర్మాల పట్ల నిబద్ధతని అలవరచేదిగా, అనేక సందర్భాల్లో కవ్వించి కన్నీళ్లు పెట్టించి ఆనందానుభూతినిచ్చే రసవత్తరమైన నవలగా మిక్కిలి పఠనీయం. ఇంతటి గొప్ప రచన చేసిన డా. కె. రామలక్ష్మి గారు ప్రశంసలకు ఎంతైనా అర్హులు.
                          - కవితశ్రీ, 94946 96990