May 15,2022 07:58
  • హక్కుల పరిరక్షణతోనే శాంతిస్థాపన : చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ
  • శ్రీనగర్‌లో హైకోర్టు నూతన భవన సముదాయానికి శంకుస్థాపన

శ్రీనగర్‌ : ప్రజలు తమ హక్కులకు, హుందాతనానికి గుర్తింపు, రక్షణ ఉందని భావించినప్పుడే ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉన్నట్లు అని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. న్యాయాన్ని నిరాకరణ కచ్చితంగా అరాచకత్వానికే దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులను, హుందాతనాన్ని పరిరక్షించినప్పుడే శాంతి స్థాపన చేయగలమని ఆయన అన్నారు. జమ్ము, కాశ్మీర్‌, లడఖ్‌ హైకోర్టు నూతన భవన సముదాయానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ ఆకాంక్షలను పరిరక్షించడం, పౌరుల హక్కులను కాపాడటం కోర్టుల రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని నొక్కిచెప్పారు. ఫిర్యాదీదారులు తరుచూ తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురౌతుంటారని, అలాంటివారికి తమ వాదనలు వినిపించేందుకు వీలుగా న్యాయమూర్తులు, న్యాయవాదులు అనువైన వాతావారణాన్ని సృష్టించాలని కోరారు. భారత్‌లో న్యాయ పంపిణీ వ్యవస్థ సంక్లిష్టమైనదనీ, చాలా ఖరీదు అయినది కూడా అని ఆయన పేర్కొన్నారు. మరింత సమగ్రమైన, అందుబాటులో కోర్టులను రూపుదిద్దడంలో దేశం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సివుందని తెలిపారు. వివాదాల శీఘ్ర పరిష్కారమనేది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఒక కొలమానమని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయ నిరాకరణ అరాచకత్వానికి దారితీస్తుందని పునరుద్ఘాటించిన ఆయన న్యాయవ్యవస్థలో స్థిరత్వం కోల్పోతే..అప్పుడు ప్రజలు న్యాయ వ్యవస్థేతర పరిష్కార మార్గాలను ఎంచుకుంటారని తెలిపారు. సమన్యాయం, మానవ హక్కుల పరిరక్షణ అనేది న్యాయస్థానాలకు ప్రధానమైన సవాలు అని పేర్కొన్నారు. సామాన్యులందరూ తమ హక్కులకు, స్వేచ్ఛాస్వతంత్రాలకు ఏకైక పరిరక్షణదారు న్యాయవ్యవస్థే అని భావిస్తారని, న్యాయమూర్తులు, న్యాయవాదులు తీసుకొని సునిశిత నిర్ణయాలు కూడా సామాన్యులపై ఎనలేని ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.