Oct 17,2020 18:14

ఆక్లాండ్‌ : న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్నర్డ్‌ మరోసారి అఖండ విజయం సాధించారు. కరోనా వ్యాప్తి నివారణకు ఆమె చేసిన కృషి, సమర్థవంతమైన పాలనకు గాను ప్రజలు లేబర్‌ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. శనివారం నాటికి మూడింట రెండు వంతుల ఓట్లు లెక్కించగా.. లేబర్‌ పార్టీకి అభ్యర్థి అయిన జెసిండా ఆర్నర్డ్‌ 49.2 శాతం ఓట్లను పొందారు.

న్యూజిలాండ్ ఎన్నికల్లో జెసిండా  అఖండ విజయం

దీంతో ఏకసభ్య పార్లమెంటులోని 120 స్థానాల్లో 64సీట్లు సాధించే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్‌ పూర్తి కావల్సి వుంది. 1996లో న్యూజిలాండ్‌ దామాషా ఓటింగ్‌ విధానాన్ని ప్రారంభించినప్పటి నుండి ఏ నేతకు కూడా ఇంతటి భారీ మెజారిటీ లభించలేదు. అప్పటివరకు మిత్రపక్షాల వారసులే పాలనను కొనసాగించాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన జుడిత్‌ కాలిన్స్‌ 35 సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత దారుణమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కాగా, ఈ సందర్భంగా జెసిండా తన మద్దతుదార్లతో మాట్లాడుతూ .. రాబోయే మూడేళ్లలో తాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, సామాజిక అసమానతల పరిష్కారం తనముందున్న సవాళ్లని ఆమె పేర్కొన్నారు. ఈసందర్భంగా న్యూజిలాండ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.