Jul 21,2021 08:40

- రోదసిలోకి వెళ్లి వచ్చిన అమెజాన్‌ అధినేత బెజోస్‌
టెక్సాస్‌ :
బ్లూఆరిజన్‌ సంస్థ నిర్వహించిన 'న్యూషెపర్డ్‌' ప్రయోగం విజయవంతమైంది. రోదసీ టూరిజమే లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్ర ద్వారా అమెజాన్‌ సిఇఒ జెఫ్‌ బెజోస్‌తో సహా మరో ముగ్గురు మంగళవారం అంతరిక్షానికి వెళ్లి వచ్చారు. ఈ యాత్రలో జెఫ్‌ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్‌ బెజోస్‌, 82 ఏళ్ల వేలీ ఫంక్‌, 18 ఏళ్ల యువకుడు ఒలివర్‌ డేమన్‌ కూడా ఉన్నారు. పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) న్యూషెపర్డ్‌ ప్రయోగం ప్రారంభమైంది. 10 నిమిషాల 10 సెకండ్ల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. తిరిని భూమిని చేరుకున్న అనంతరం నలుగురు వ్యోమగాములు విజయసంకేతం చూపుతూ క్యాప్స్యూల్‌ నుంచి బయటకు వచ్చారు.