Jun 24,2022 07:31

* లేకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ :
కేంద్రం తమ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత చర్యకు నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు స్కీమ్‌ (ఎన్‌సీఎల్‌పీ) ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలను తిరిగి ఇవ్వాలనీ, లేకపోతే నిరసనలు కొనసాగుతాయని మోడీ సర్కారును హెచ్చరించారు. ఈ మేరకు వారు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.
ఎన్‌సీఎల్‌పీని 1996లో ప్రారంభించారు. ఇది కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. ఈ పథకం కింద వేలాది మంది టీచర్లు పని చేశారు. అయితే, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) విలీనంతో ఎన్‌సీఎల్‌పీ ని కేంద్రం ఉపసంహరించింది. దీంతో దేశవ్యాప్తంగా 272 జిల్లాల నుంచి దాదాపు 36 వేల మంది ఉపాధ్యాయులు నిరుద్యోగులుగా మారాల్సిన దుస్థితి ఏర్పడిందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ఉపసంహరణ కారణంగా ఎన్‌సీఎల్‌పీ పాఠశాలల్లోని విద్యార్థుల విలీనం మాత్రమే జరిగిందనీ, ఉపాధ్యాయులకు స్వల్ప వేతనాలే చెల్లించబడ్డాయని నిరసనకారులు ఆరోపించారు. గత ఐదేండ్లుగా తమకు వేతనాలు అందటంలేదని మరికొందరు తెలిపారు. '' సామాజిక ప్రయోజనం కోసం గత 26 ఏండ్లుగా మేము తక్కువ వేతనాలకే విధులు నిర్వర్తించాం. ఇప్పుడు నిరుద్యోగులమయ్యాం. మా గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు పట్టించుకుంటారు? తిరిగి మా ఉద్యోగాన్ని పొందే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం'' అని ఎన్‌సీఎల్‌పీ టీచర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ సీతారామ్‌ ఉమ్రానీ ప్రశ్నించారు. ఎన్‌సీఎల్‌పీ టీచర్ల నిరసనలలో 21 రాష్ట్రాల నుంచి ఆందోళనకారులు పాల్గొన్నారు. కేంద్రం తమను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.