Mar 15,2023 15:05

ముంబయి  :   మహారాష్ట్ర సీనియర్‌ నేత, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ దాదా సోలంకి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లో తెలంగాణ మోడల్‌ ను అమలు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకాశ్‌ దాదా మాట్లాడుతూ.. రాష్ట్రం సర్‌ ప్లస్‌ అవుతుంది అనే మాటలు ఆపాలని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని గమనించాలని సూచించారు. రైతులకు ఇవ్యాలనే తపన ఉండాలని, మంచి చేయాలనే సంకల్పముండాలని, అందుకు తెలంగాణ రాష్ట్రం ఒక ఉదాహరణ అని అన్నారు. ఆ రాష్ట్రం మోడల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు ఎకరాకు సంవత్సరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది అని గుర్తు చేశారు. పండించిన ప్రతి గింజనూ అక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతు చనిపోతే రూ. 5 లక్షల బీమాను అందిస్తున్నదని, అది తెలంగాణ మోడల్‌ అని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అమలుచేయవచ్చని హితబోధ చేశారు. ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులను ఆదుకోవచ్చని.. అయితే అందుకు మంచి మనసుండాలని చెప్పుకొచ్చారు.