Nov 25,2022 13:35
  • 42సీట్లతో అతి పెద్ద పార్టీగా నేపాలీ కాంగ్రెస్‌

ఖాట్మండు : నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని పాలక సంకీర్ణం స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా దూసుకెళుతోంది. ఇప్పటివరకు 124 సీట్ల ఫలితాలను ప్రకటించిన తర్వాత అందులో 67 సీట్లు పాలక కూటమికే వచ్చాయి. 275మంది సభ్యులు గల ప్రతినిధుల సభలో 165మందిని ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. మిగిలిన 110మందిని దామాషా ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎన్నుకుంటారు. స్పష్టమైన మెజారిటీ రావాలంటే ఏ పార్టీకైనా, కూటమికైనా 138సీట్లు రావాల్సి వుంది. ప్రత్యక్ష ఓటింగ్‌ వ్యవస్థ ద్వారా 42సీట్లను గెలుచుకుని నేపాలీ కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. భాగస్వామ్య పార్టీలైన సిపిఎన్‌-మావోయిస్ట్‌ సెంటర్‌, సిపిఎన్‌-యునిఫైడ్‌ సోషలిస్టులకు వరుసగా 12, 10సీట్లు లభించాయి. లోక్‌తాంత్రిక్‌ సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనమోర్చాలకు వరుసగా రెండు, ఒక సీటు లభించాయి. ఇవన్నీ కూడా పాలక కూటమిలో పార్టీలే. ఇక ప్రతిపక్ష కూటమి, మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్‌-యుఎంఎల్‌కి 38సీట్లు లభించాయి. సిపిఎన్‌-యుఎంఎల్‌కు 30సీట్లు రాగా, భాగస్వామ్య పార్టీలు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్‌వాదీ పార్టీలకు వరుసగా ఐదు, మూడు సీట్లు లభించాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ఏడు సీట్లు లభించాయి. మాధేషి పార్టీలైన లోక్‌తంత్రి సమాజ్‌వాదీ పార్టీ, జన్‌మత్‌ పార్టీలకువరుసగా రెండు, ఒకటి సీట్లు లభించాయి. నాగరిక్‌ ఉన్ముఖి పార్టీకి రెండు, జనమోర్చా, నేపాల్‌మజ్ద్‌ కిసాన్‌ పార్టీలకుచెరొకటి రాగా, స్వతంత్ర అభ్యర్ధులు ఐదు సీట్లను గెలిచారు. ప్రతినిధుల సభకు, ఏడు ప్రావిన్షియల్‌ అసెంబ్లీలకుఆదివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం నుండి ఓట్ల లెక్కింపు ఆరంభమైంది.