Oct 05,2022 06:17

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్వవ్యాత్తంగా విద్యారంగం, ఉపాధ్యాయుల పాత్ర, స్థానం, వివిధ దేశాల ప్రభుత్వ వైఖరుల గురించి చర్చించడం ఎంతైనా అవసరం. విశాలమైన విద్యా రంగాన్ని అనేక కోణాల నుండి పరిశీలించాల్సి ఉంది.

  • గురువులు లేరు

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే, యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ గణాంకాల ఆధారంగా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం మన దేశ వ్యాప్తంగా 14.16 లక్షల మంది టీచర్లు అవసరం. దాదాపు 2 లక్షల పైచిలుకు సింగిల్‌ టీచర్లు 91 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారని ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా పేరుతో యునెస్కో ఈ నివేదికను విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు పెద్ద సంఖ్యలో వుండడాన్నిబట్టే విద్య పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుంది.

  • దేశ దేశాలలో ఉపాధ్యాయుల స్థితిగతులు

కరోనా మహమ్మారి 2020-2021 సంవత్సరాలలో అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. 2019 రిపోర్టులను, నేటి పరిస్థితులను పరిశీలించినట్లయితే గురువు స్థానం ఏ విధంగా వుందో 35 దేశాలలో వర్క్‌ ఫౌండేషన్‌ వారి సర్వే తెలియచేసింది. చదువుకుంటున్న యువత, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ చేసింది. ప్రజల అభిప్రాయాలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు, అధిక జీతాలు, వృత్తిలో వైపుణ్యత, బోధనా సామర్ధ్యం, విద్యార్థుల అభ్యసన స్థాయి ప్రాతిపదికల ఆధారంగా ఉపాధ్యాయులకు గౌరవం లభిస్తుంది. 35 దేశాలలో జరిగిన అభిప్రాయ సేకరణలో భవిష్యత్తులో ఉపాధ్యాయులు కావాలనుకునేవారు సగటున 8వ స్థానం నుండి 18వ స్థానం వరకు ర్యాంకింగ్‌ ఇచ్చారు.
ఫ్రాన్స్‌, నైజీరియాలో, కొరియా, ఇంగ్లాండ్‌, చికాగో, స్పెయిన్‌, పోర్చుగల్‌, జపాన్‌, ఇజ్రాయిల్‌, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌ వంటి దేశాలలో ప్రపంచీకరణ విధానాల వలన విద్యారంగం సంక్షోభంలో పడింది. ఉపాధ్యాయులకు పని గంటలు పెంచాయి. వేతనాల బడ్జెట్లలో భారీ కోతలు విధించాయి. నష్టపరిహారం అలవెన్సులు ఆపాయి. పోర్చుగీసు ప్రభుత్వం...ప్రభుత్వ పాఠశాలలకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. పాకిస్తాన్‌లో ఉపాధ్యాయులపై దాడి, ప్రగతిశీల భావాలకు అడ్డుకట్ట వేయడం, అమెరికాలో పాఠశాలలు మూసివేయడం, పాఠశాలలపై దాడులు, మరో 34 ధనిక దేశాలు విద్యారంగ బడ్జెట్లో తీవ్రమైన కోతలు పెట్టడం కనిపిస్తున్నాయి. జింబాబ్వేలో టీచర్ల జీతాలు తలసరి ఆదాయం కన్నా తక్కువగా ఉన్నాయి. ఉగాండా, బెర్లిన్‌ లలో మెరుగైన వేతనాల కోసం టీచర్లు సమ్మెలు చేశారు. న్యూజిలాండ్‌లో ప్రైవేటు ఛార్టర్‌ స్కూళ్లను మూసివేయాలని తల్లిదండ్రులు పోరాటాలు చేశారు.
విద్యారంగ సంక్షోభాలు ఉపాధ్యాయులకు సవాళ్లుగా మారాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి సర్వే వెలువరించిన అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. విద్యపై పెట్టుబడులు తగ్గించాలనే అంశం ఆయా దేశాలలో విద్యారంగ పరిస్థితులకు అద్దం పడుతుంది. అక్కడ పెన్షన్‌, జీతాల పెంపు కోసం, సర్వీసు అంశాల రక్షణ, పెన్షన్‌ భద్రత కోసం, వేతనాల కోసం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు.
భారత దేశంలో ఉపాధ్యాయుల స్థితి మరింత దిగజారింది. గత 5 సంవత్సరాలుగా సంస్కరణల అమలు, నూతన విద్యా విధానం-2020 అమలు కారణంగా పాఠశాలల మూత, ఉపాధ్యాయుల తగ్గింపు, బడ్జెట్‌ కోత, నూతన పెన్షన్‌ విధానం అమలు, బోధనేతర కార్యక్రమాలు, పాఠశాలల క్లస్టరైజేషన్‌ వంటివి...ఉపాధ్యాయుల ప్రాధాన్యతను, గౌరవాన్ని దిగజార్చాయి. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే పరిస్థితులు, పోరాటాలు చేస్తే నిర్బంధాలు, పోలీసు కేసులు వంటివి ఉపాధ్యాయ వర్గాన్ని పీడిస్తున్నాయి. డిజిటల్‌, ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశపెట్టి విద్యారంగాన్ని వ్యాపారం చేస్తున్నారు. టీచర్లను రోబోలుగా చిత్రీకరించబోతున్నారు. అందువల్లనే భారత్‌లో ఉపాధ్యాయ వృత్తి కావాలనుకునే యువత 9వ స్థానాన్ని ఎంచుకుంది. గురుశిష్యుల సంబంధాలను పూర్తిగా దెబ్బతీసే విధానాలు వచ్చాయి. అందుకే ఆశించిన లక్ష్యాలు చేరలేక పోయామని యునిసెఫ్‌, యునెన్కో, ఐఎల్‌ఓ ఆందోళన వ్యక్తం చేశాయి. 54 దేశాలలో పాఠశాలలు ఎత్తివేయడం, కుదించడం అంటే విద్య సహస్రాబ్ది లక్ష్యాలు నీరుగారుతున్నాయని హెచ్చరించాయి.

  • భిన్నమైన పరిస్థితులు

ఇటీవల ఎన్‌ఎఫ్‌ఇఆర్‌ చేసిన సర్వేలో ఉపాధ్యాయులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని తేల్చారు. సెలవుల్లో కూడా వృత్తికి సంబంధించిన పని ఒత్తిడి పెరిగింది. రికార్డులు రాసుకోవడం, రిపోర్టులు తయారు చేసుకోవడం, పరీక్షలు, డిజిటల్‌, ఆన్‌లైన్‌ యాప్‌లు, సమీక్షలు, మీటింగులు, సర్వేలు, విద్యేతర కార్యక్రమాల జోరు పెరిగింది. ఇలాంటి క్లిష్టతర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయలేకపోతున్నామని అసంతృప్తికి లోనవుతున్నారు.
ఏ దేశంలో అయినా విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో...ఆ దేశంలో ఉపాధ్యాయులకు అంతటి గౌరవం లభిస్తుందనేది అసలు ప్రాతిపదిక. ఉత్తర యూరప్‌, వెనిజులా, ఫిన్లాండ్‌, క్యూబా, చైనా వంటి దేశాలలో ప్రపంచీకరణ విధానాలకుగాక ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వలన టీచర్‌కు చాలా గౌరవం ఉందని...లింగ వివక్షత, నేర చరిత వంటివి చాలా స్వల్పం అని నిరూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనగలగాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులు సామాజిక ఉద్యమకారులు కావాలి. ఏ సంస్కరణలు అయితే విద్యకు నష్టదాయకంగా ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు చేపట్టాలి. నిధుల కొరత, టీచర్ల కొరత, పోషక ఆహారాల కొరత, భవనాల కొరత, ఆరోగ్య సమస్య, నూతన పెన్షన్‌ విధానం, వేతనాల కోత వీటన్నింటిపై ఉద్యమాలు చేపట్టాలి. పాలకుల లక్ష్యం విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి సామాజిక లక్ష్యం నుండి తొలగిపోవడమే. వీటిని అడ్డుకోవడానికి ఏకైక మార్గం ప్రతిఘటనే.
సంస్కరణల చట్రం నుండి విద్యా వ్యవస్థను విడదీసి చూడలేని నేటి పరిస్థితులలో ఉమ్మడి లక్ష్యంగా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ కర్తవ్యం కావాలి.

(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)

vijaya gowri

 

 

 

వ్యాసకర్త : కె. విజయగౌరి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు