Nov 23,2022 15:11

విల్లింగ్టన్‌  :    ఓటు హక్కును 18 ఏళ్ల నుండి 16 ఏళ్లకు తగ్గించడంపై చట్టసభ సభ్యుల నిర్ణయం తీసుకుంటామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ తెలిపారు. 16 ఏళ్లకు ఓటు హక్కును కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 18 ఏళ్లకు ఓటు హక్కు హక్కుల బిల్లుకు విరుద్ధంగా ఉందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులకు తాను మద్దతిస్తున్నానని, ఈ ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని జెసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్‌లోని 75శాతం మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో '16 ఏళ్లకే ఓటు' ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం లేదని ప్రధాని పేర్కొన్నారు. ఓటు హక్కును 1969లో 21ఏళ్ల నుండి 20 ఏళ్లకి తగ్గించగా, తర్వాత 1974లో న్యూజిలాండ్‌ ప్రభుత్వం 18 ఏళ్లకు తగ్గించింది. వాతావరణ మార్పులు, గృహ వ్యయం, జీవన వ్యయం, ఉచిత విద్య వంటి పలు అంశాలపై యువత ప్రభావితమవుతున్నందున వారిని ఓటు వేసేందుకు అనుమతించాలంటూ 'మేక్‌ ఇట్‌ 16' అనే బృందం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.