Nov 24,2022 15:20

లండన్‌  :   తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా   బ్రిటన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి అనుమతి కోరుతూ   పరారీలో ఉన్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోడీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13 వేల కోట్ల మేరకు మోసగించిన నీరవ్‌ మోడీ బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. మానసిక అనారోగ్య కారణాల రిత్యా తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఈ నెల ప్రారంభంలో చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ అప్పీల్‌ను కొట్టివేయడం వల్ల నీరవ్‌ మోడీపై సిబిఐ, ఇడిలు పెద్ద విజయం సాధించినట్లైంది. ఆత్మహత్యకు పాల్పడవచ్చనే కారణంతో ఆయనను భారత్‌కు విచారణకు అప్పగించకపోవడం సరికాదని హైకోర్టు పేర్కొంది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ 2021లో అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నీరవ్‌ లండన్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై ఈ ఏడాది ఆరంభం నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, హైకోర్టు తీర్పును 14 రోజుల్లోగా నీరవ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసుకునే అవకాశం ఉండటంతో నీరవ్‌ మోడీ అందుకు అనుమతి కోరారు.