Aug 09,2022 22:52
  • సిఎం పదవికి రాజీనామా
  • ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి నేడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు
  • డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌

న్యూఢిల్లీ : మహారాష్ట్ర తరహాలో మరో తిరుగుబాటు వస్తుందని ముందే ఊహించిన జెడి(యు) అధినేత నితీష్‌ కుమార్‌ మంగళవారం బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. అమిత్‌ షా, ప్రధాని మోడీ ద్వయానికి ఊహించని షాక్‌ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వ ముఖ్యమంత్రిగా వైదొలగిన నితీష్‌, బుధవారం మహాఘట్‌ బంధన్‌ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడి నేత తేజస్వియాదవ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నితీష్‌తో కలసి తేజస్వియాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ, 'మేం సోషలిస్టులం మా పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టుకుంటాం' అని అన్నారు. తమతో పొత్తు పెట్టుకున్నవారిని అంతం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలి. నితిష్‌ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఏడు పార్టీల నిర్ణయం అని అన్నారు. . అంతకుముందు బీహార్‌ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గవర్నరు ఫాగు చౌహాన్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే నుంచి విడిపోవాలని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
. రాజీనామా తర్వాత గవర్నర్‌ కార్యాలయం నుంచి నేరుగా రబ్రీదేవి నివాసానికి నితీశ్‌కుమార్‌ బయల్దేరారు. అక్కడ తేజస్వీ యాదవ్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై నితీశ్‌ చర్చించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు గవర్నర్‌ అపాయింట్‌మేంట్‌ కోరారు. ఈమేరకు సాయంత్రం 6గంటలకు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై లేఖను సమర్పించారు. 243 మంది సభ్యులున్న బీహార్‌ అసెంబ్లీలో ఆర్జేడీ-80, బీజేపీ-77, జేడీయూ-45, కాంగ్రెస్‌-19, వామపక్షాలు-16 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు.

  • ఇకపై బిజెపి అజెండా నడవదు : తేజస్వీ యాదవ్‌

గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌ సంచలన ప్రకటన చేశారు. ''నితీశ్‌కు ఆర్జేడీతో సహా మొత్తం 7 పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మొత్తం 164మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అంతేకాదు బీజేపీ ఇప్పుడు ఒంటరి పార్టీ అయ్యింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అరాచకత్వం సృష్టిస్తోంది. బీజేపీ అజెండా ఇకపై బీహార్‌లో నడవదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా దక్కలేదు. అన్ని విషయాల్లోనూ బీజేపీ విఫలమైంది'' అని అన్నారు.

  • బుధవారమే కొత్త ప్రభుత్వం

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమికి తగినంత బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను నితీశ్‌కుమార్‌ కోరారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సైతం నితీశ్‌ వెంటే ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏడు పార్టీలకు చెందిన 164మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని నితీశ్‌ చెప్పారు. ఇందుకు సంబంధించి లేఖను గవర్నర్‌కు సమర్పించినట్టు తెలిపారు. గవర్నర్‌ నుంచి ఆదేశాలు అందగానే బుధవారమే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని జేడీయూ, ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి.

  • తెరవెనుక కుట్రలు పసిగట్టిన నితీశ్‌

గతంలో నితీశ్‌ కుమార్‌(2015 అసెంబ్లీ ఎన్నికల్లో) జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా..లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు. 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే సీఎం పదవి నితీశ్‌కు వదిలేసిన బీజేపీ, ఆయన వెనుకే గోతులు తవ్వుతోందని, రాజకీయ కుట్రకు తెరలేపిందని జేడీ(యూ) నాయకులు అనుమానిస్తున్నారు. నితీశ్‌కుమార్‌ను స్వంత పార్టీలోనే బలహీనపర్చాలని ప్రధాని మోడీ, అమిత్‌ షా ద్వయం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నితీశ్‌ను హఠాత్తుగా పదవిలో నుంచి దింపేయాలని రాజకీయ సమీకరణాలు సిద్ధం చేసింది. అయితే ఇవన్నీ పసిగట్టిన నితీశ్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే మంగళవారం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమైన నితీశ్‌ కుమార్‌ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయానికి పార్టీలోని నాయకులు కూడా మద్దతు తెలిపారు.

  • బిజెపి-జెడియుల బంధం 21 నెలలకే..

2020లో బీజేపీ, జేడీయూల మధ్య ఏర్పడిన కూటమి విచ్ఛిన్నమైంది. సీఎం పదవికి నితీశ్‌ రాజీనామా సమర్పించిన అనంతరం రాజ్‌భవన్‌లో నితీశ్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఏతో పొత్తును తెంచుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే గొంతుకలో మాట్లాడారని అన్నారు.

  • 9 ఏళ్లలో రెండు సార్లు పొత్తుకు నితీశ్‌ బైబై..

2013లో బీజేపీ, 2017లో ఆర్జేడీతో పొత్తులను నితీశ్‌ టాటా చెప్పారు.బీహార్‌ లో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

  • తొలిసారిగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ

తనకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదనీ, ఆ ఎమ్మెల్యేలు సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్‌కు నితీశ్‌ అందజేశారు. మహాకూటమి నాయకుడిగా ఎన్నికైన నితీశ్‌ నేరుగా రబ్రీ దేవి నివాసానికి చేరుకున్నారు. జితన్‌రామ్‌ మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం కూడా నితీశ్‌తో జతకట్టింది. ఆయనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.