Aug 09,2022 21:13

ధరలు పెరుగుదలను అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి
గోరంట్ల మాధవ్‌ది మార్ఫింగ్‌ వీడియో
వైసిపి ఎంపిలు భరత్‌,  కృష్ణయ్య,  అనురాధ
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : 
రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైనా మద్దతు లేదని వైసిపి ఎంపిలు అన్నారు. దేశంలో ధరలు పెరుగుదలపై పార్లమెంటులో అన్ని పార్టీలూ ముక్తకంఠంతో వ్యతిరేకించాయని తెలిపారు. మంగళవారం ఎపి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి ఎంపిలు మార్గాని భరత్‌, ఆర్‌ కృష్ణయ్య, చింతా అనురాధ మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయన్నారు. నిత్యావసర వస్తువల ధరల పెరుగుదల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించామన్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి చర్చించామన్నారు. వంట నూనె మొదలు, వంట గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని అన్ని రాజకీయ పార్టీలూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయన్నారు. రైతు సమస్యలపైనా చర్చించామని, వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇచ్చి వాటిని ఇక్కడే పండించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్‌డిఎ సర్కారు వీటిపైన ఎందుకు దృష్టిపెట్టలేదని ప్రశ్నించారు. పామాయిల్‌కు ఎంతయితే డిమాండ్‌ ఉందో దాన్ని దేశంలోనే పండించుకునే సామర్థ్యం ఉందని అన్నారు. అయినా ఆ పంట పండించడంలో వెనుకబడి ఉన్నామని, దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో పరిమితికి మించి ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను ఉల్లంఘించి నిధులు తీసుకున్నారని, ఇప్పుడు తమకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టడం సరికాదని అన్నారు. ఎపిని మిగతా రాష్ట్రాలతోపాటు చూడకుండా, ప్రత్యేక దృష్టితో చూడాలని, నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాగ్‌, నీతి ఆయోగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌, రెవెన్యూ లోటు రూ.22 వేలకోట్లు ఉందని, దానిలో కేవలం రూ.4 వేలకోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని తెలిపారు. మిగతా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ జెన్‌ కో నుంచి ఎపికి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.6,627 కోట్లు ఇప్పించాలని కోరామన్నారు. ఎపికి మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరో 13 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపనలు చేసిందని తెలిపారు. వాటిని కేంద్రమే టేకప్‌ చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టిడిపి సోషల్‌ మీడియాలో, మీడియాలో రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, వారి పబ్లిసిటీ పిచ్చి చూస్తే.. ఇదంతా చిన్నపిల్లల వ్యవహారంలా ఉందని ఎద్దేవా చేశారు. ఎంపి గోరంట్ల మాధవ్‌ వీడియో ఫ్యాబ్రికేటెడ్‌ (మార్ఫడ్‌)గా అనుకుంటున్నామని, ఒకవేళ అది నిజమని తేలితే తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని, అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఇప్పటివరకూ, ఆ వీడియోకు సంబంధించి మాట్లాడిన మహిళ ఎవరో కూడా ఫిర్యాదు చేయలేదని తెలిపారు.