Jun 22,2022 13:21

న్యూయార్క్‌ : రష్యా యుద్ధంతో శరణార్థులుగా మారిన ఉక్రెయిన్‌ చిన్నారుల సంక్షేమం కోసం ప్రముఖ పాత్రికేయుడు దిమిత్రి మురతోవ్‌ చేసిన ప్రయత్నానికి ఊహించని స్పందనే కాదు.. రికార్డు స్థాయి ధర పలికింది. 2021కి గానూ తనకు లభించిన నోబెల్‌ శాంతి విశిష్ఠ పురస్కారాన్ని వేలం వేయగా వచ్చిన సొమ్మును యూనిసెఫ్‌ ద్వారా చిన్నారుల కోసం ఖర్చు చేస్తానని ఈ రష్యా పాత్రికేయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే దాన్ని వేలం వేశారు. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి న్యూయార్క్‌లో 'హెరిటేజ్‌ ఆక్షన్స్‌' నిర్వహించిన వేలంలో ఈ శాంతి బహుమతిని 10.35 కోట్ల డాలర్ల (సుమారు రూ.800 కోట్లు)కు ఒకరు సొంతం చేసుకున్నారు. ఇదే రికార్డు స్థాయి వేలం. 2014లో జేమ్స్‌ వాట్సన్‌ తన నోబెల్‌ పురస్కారాన్ని వేలం వేసినప్పుడు 47.6 లక్షల డాలర్ల ధర పలికింది. ఇప్పటివరకు ఆ పురస్కారాలకు వేలంలో దక్కిన అత్యధిక ధర అదే. ఇప్పుడు ఈ రికార్డు చెరిగిపోయింది. 175 గ్రాముల బరువైన 23 క్యారెట్ల బంగారు పతకం వాస్తవ విలువ 10,000 డాలర్లే అయినా ఇది నోబెల్‌ పురస్కారానికి లభించింది కావడంతో వేలం పాటలో అనేకమంది పోటాపోటీగా పాల్గన్నారు. చిన్నారులకు వారి భవిష్యత్తును తిరిగి ఇవ్వాలనే తపనతోనే పతకాన్ని వేలం వేసినట్లు మురతోవ్‌ చెప్పారు.