
ఇంటర్నెట్ డెస్క్ : ఉత్తరకొరియాలో కోవిడ్ విజృంభిస్తోంది. గత వారమే ఆ దేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ దాదాపు 10 లక్షల మంది వరకు కోవిడ్ బారినపడ్డారు. అయితే అక్కడ భారీగా కరోనా పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో కేవలం లక్షణాల ఆధారంగానే కరోనా వ్యాపి చెందిందని వైద్యులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆ దేశంలో 10 లక్షల మందికిపైగా జ్వరంతో బాధపడుతున్నారని, ఇప్పటివరకు 50 మంది కోవిడ్‌కు బలయ్యారని అక్కడి ప్రభుత్వ మీడియానే వెల్లడించింది.
కాగా, గతేడాది ఉత్తరకొరియాలో వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అమెరికా తయారు చేసిన ఆస్ట్రాజెనికా, చైనా తయారు చేసే టీకాలను సరఫరా చేస్తామని ఆఫర్ ఇచ్చినా.. కిమ్ ఆ ఆఫర్లను తిరస్కరించారు. అక్కడి ప్రజలకు టీకాలు వేయకుండా.. కేవలం లాక్కౌడన్, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు గతేడాది కన్నా.. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాగే కిమ్ కోవిడ్ పరిస్థితిపై ఇటీవల పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఔషధ సరఫరాలో అధికారులు విఫలమ్యారని ఆయన విమర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉత్తర కొరియా సైన్యంలో మెడికల్ కోర్‌ను రంగంలోకి దింపారు. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.
