Aug 11,2022 08:34

సియోల్‌ : కోవిడ్‌పై తిరుగులేని (మెరుపు) విజయాన్ని సాధించామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం తెలిపారు. గత రెండు వారాల నుండి కొత్త కేసులేమీ నమోదు కాలేదన్న అధికారుల రిపోర్టు ఆధారంగా ఈ ప్రకటన చేశారు. కిమ్‌ అధ్యక్షతన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో... ప్రాణాంతక మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విజయం సాధించామని ప్రకటించినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చుట్టేస్తున్న సమయంలోనే ఉత్తరకొరియా కఠినమైన ఆంక్షలను అవలంభించింది. మేలో రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ఓమిక్రాన్‌ వ్యాప్తి ఉన్నట్లు ప్రకటించిన ఆ దేశం.. గరిష్ట అత్యవసర అంటువ్యాధి నివారణ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది. జులై 29 నుండి దేశంలో కొత్త వైరస్‌ కేసులేమీ నమోదు కాలేదు. ఈ సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ.. 'ఇది మన ప్రజలు సాధించిన విషయం. మన దేశ గొప్పతనం, ఇక్కడి ప్రజల దృఢత్వం గురించి ప్రపంచానికి చాటిచెప్పిన చారిత్రాత్మక ఘట్టమని' వ్యాఖ్యానించినట్లు కెసిఎన్‌ఎ తెలిపింది. ముగింపు ప్రసంగంలో హుర్రె అంటూ హర్షధ్వానాలు చేయడం, చరిత్రలో నిలిచిపోయేలా విజయాన్ని నమోదు చేసేందుకు ఆయన చేసిన కృషి, ప్రజల కోసం అంకిత భావంతో చేసిన సేవ గురించి పదేపదే గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కిమ్‌తో హాజరైన సీనియర్‌ అధికారులతో ఓ ఫోటో సెషన్‌కు కూడా నిర్వహించారు. ఉత్తరకొరియాలో ఏప్రిల్‌ చివరి నుండి దాదాపు 4.8 మిలియన్ల కేసులు నమోదు కాగా, కేవలం 74 మరణాలే సంభవించాయి.