Mar 19,2023 22:26
  • కుట్ర రాజకీయాలకు భయపడనని వ్యాఖ్య

ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి, తిరువూరు : నాడు-నేడు పూర్తయిన పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. కుట్ర రాజకీయాలకు భయపడబోనన్నారు. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయంలో ఉన్న తోడేళ్లన్నీ ఏకమై ముప్పేట దాడికి తయారవుతున్నాయని, ఇవన్నీ కలిసినా తననేమీ చేయలేవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో ఆదివారం జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో బటన్‌ నొక్కి రూ. 698.68 కోట్ల నిధులను 8,83,723 మంది తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యకు సంబంధించి ఎంతో మంచి మార్పులు చేస్తుంటే దుష్టచతుష్టయం ఓర్చుకోలేకపోతోందని విమర్శించారు. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. విలువలులేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతినడానికి తోడేళ్లన్నీ ఏకమై పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. పేదల కోసం పనిచేస్తున్న తనకు నమ్మకం, ధైర్యం, అండ అన్నీ ప్రజలేనని పేర్కొన్నారు. ఎల్లో మీడియాకు, కుట్ర రాజకీయాలకు తాను భయపడేది లేదన్నారు. ఇదివరకు దోచుకో, పంచుకో, తినుకో (డిపిటి) పద్ధతిలో పరిపాలన సాగితే, తమ ప్రభుత్వం నేరుగా డిబిటి ద్వారా లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు జమ చేస్తోందని అన్నారు. ఇదే బడ్జెట్‌ ఉన్న టిడిపి హయాంలో చంద్రబాబు పేదలకు ఎందుకు డబ్బులు నేరుగా ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పటి బడ్జెట్‌ నిధులన్నీ నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల పేరుతో పెత్తందారులు దోచుకుతిన్నారని ఆరోపించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని తెలిపారు. ఉన్నత విద్యలో మంచి ప్రమాణాలతో మార్పులు చేస్తున్నామన్నారు. జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులను, కరిక్యులమ్‌లను మారుస్తున్నామని తెలిపారు. గత 45 నెలలుగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధిని, మార్పును గమనించాలని కోరారు. జీవన ప్రమాణాలు పెరగాలంటే చదువు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు మాదిరిగా పేదరికాన్ని జయించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. పూర్తి స్థాయిలో ఫీజురీయింబర్స్‌ చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 27 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ. 9,947 కోట్లు చెల్లించామని తెలిపారు. 2017 నుంచి 2019 వరకు టిడిపి హయాంలోని రూ.1,777 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా చెల్లించామన్నారు. కళాశాలల్లో సమస్యలుంటే 1092కి నేరుగా ఫోన్‌ చేస్తే ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. ప్రపంచంతో పిల్లలు పోటీ పడాలని, సత్య నాదెళ్ల మాదిరిగా ఎదగాలని ఆకాంక్షించారు. 2018-19లో 87,400 మంది ఇంజనీరింగ్‌లో వంటి కోర్సుల్లో చేరితే తమ ప్రభుత్వం చేపట్టిన విద్యా, వసతి దీవెనల వల్ల ఆ సంఖ్య 1.25 లక్షలకు పెరిగిందన్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాల పొందే వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బత్స సత్యనారాయణ, తానేటి వనిత, మేరుగ నాగార్జున, కలెక్టర్‌ ఢిల్లీరావు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గన్నారు.

  • సిపిఎం, గిరిజన సంఘం నాయకులు గృహ నిర్బంధం

ముఖ్యమంత్రి తిరువూరు వస్తున్న నేపథ్యంలో పోలీసులు శనివారం రాత్రి పలువురు సిపిఎం, గిరిజన సంఘం నాయకులను గృహ నిర్బంధం చేశారు. సిఎం పర్యటన తర్వాత వారిని విడిచిపెట్టారు. రైతుసంఘం ఎ.కొండూరు మండలం కార్యదర్శి ఆళ్ల అమ్మిరెడ్డి, మరికొందరు రైతులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.