Jul 26,2021 06:22

ఆకలినీ, ఆత్మహత్యల్నే
సాక్షాత్కరించుకున్నానిన్నాళ్ళూ
కొమ్మనీ, ఉరికొయ్యనే
దర్శించుకున్నానిన్నాళ్ళూ
ఖాళీ దోసిళ్ళనీ, కాగితపు పువ్వుల్నే
పరామర్శించానిన్నాళ్ళూ
రసి గాయాల్నీ, పసిహత్యల్నే
నిరసించానిన్నాళ్ళూ...

కాసుకి వొకవైపే కాపలా కాసాను
వొంటి కంటి తోనేకలగన్నాను
మద్యనదీ వరదల్లో
తలకిందులైన పడవల్నీ
ఆశల కల్పవృక్షం కొమ్మల్లో
గిరికీలు కొడుతున్న పతంగుల్నీ
పరదేశీ పౌరసత్వ ప్రార్థనల్లో
చితులు పేర్చుకున్న ఫీనిక్సుల్నీ
రక్తం రంగు మర్చిపోతున్న కళ్ళనీ
మహమ్మారి చేస్తున్న మౌనయుద్ధాల్నీ
ఏకాక్షి విలోకనమే అన్నీ...

చూపంతా రంగస్థలం మీదే
తెరవెనుక వీక్షించనే లేదు
తెరమరుగైన వైనం సమీక్షించనే లేదు
ఇంత అసహనాన్ని ఊహించనేలేదు
లావా ప్రవాహంలోనే అర్థమైంది
రాజకీయ రంగుల రాట్నం
తిరుగుతున్నప్పుడే జ్ఞానోదయమైంది

నా వెనుకే నా నీడ
రజనీముఖంతో నవ్వుతూ
ఓ చిన్న చీకటి చుక్కతో
నా వైపే చూపుతూ నా చూపుడు వేలు..!
 

- డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
9849230443