Oct 02,2022 06:59

'సిరిమల్లె పూవల్లె నవ్వు/ చిన్నారి పాపల్లే నువ్వు' అంటారు ఆచార్య ఆత్రేయ. 'ఒక్క నవ్వు చాలు చెలి...పూవుల మాసం/ నవ్వు రంగు పులుముకోదా... నా ప్రతి నిమిషం' అంటాడు మరో కవి. 'నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది' అని ఓ కవి రాస్తే... 'నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ... నవ్వుతూ చావాలిరా' అంటాడు ఇంకో కవి. సందర్భాలు ఏవైనా ఎప్పుడూ నవ్వుతూ వుండాలనేది సారాంశం. నవ్వు ముఖానికి పెట్టని ఆభరణం. కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు... చెదరని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మాధ్యమం లేని భాష చిరునవ్వు. ఇది మనసు భాష. పెదవులపైన, కనుపాపలపైన చిందే స్వచ్ఛమైన చిరునవ్వు ఎదుటివారిని కట్టిపడేస్తుంది. సంతోషాన్ని, ప్రేమను పంచిపెడుతుంది. అందుకే అంటాడు అరిస్టాటిల్‌...'ఎదుటి వ్యక్తులను చిరునవ్వుతో పలకరించడం నేర్చుకుంటే, ఈ ప్రపంచంలో నీకు శత్రువులంటూ ఉండరు' అని. దేశం ఏదైనా... మాట్లాడే భాష ఏదైనా... ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భాష నవ్వు. పువ్వులు వికసించడంలో సున్నితంగా పెదాలు విచ్చుకున్నంత హాయి వుంటుంది. పక్షుల కిలకిలరావాల్లో పట్టరాని సంతోషంతో నవ్వే కిలకిలలుంటాయి. మెల్లగా ప్రవహించే గోదావరి అలల్లోనూ, ఎగసిపడే కడలి కదలికలోనూ నవ్వుల జోరు కదలాడుతుంది. ఇవన్నీ నవ్వుకు సంకేతాలే. మనిషికీ మనసుకూ ఆహ్లాదాన్ని పంచేవే... చిరునవ్వులు పూయించేవే. ఎందుకంటే... నవ్వు అనేది మనిషి అభ్యాసంతో అబ్బిన విద్య కాదు. జన్మత: లభించిన లక్షణం. అందుకే అంటారు.. 'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని.
ఆధునిక జీవితంలో ఉరుకుల పరుగుల జీవనంలో... మనిషి గడియారంలోని ముళ్లలా యాంత్రికంగా మారాడు. మనిషి జీవన శైలిలో యంత్రాలు భాగమైనట్లే మన వ్యక్తిత్వంలోనూ యాంత్రికత అంతర్భాగమైంది. ఇంట్లో నలుగురు కలిసి సరదాగా గడపాల్సిన సమయంలోనూ ఎవరికి వారే సెల్‌ఫోన్‌లలో బిజీగా గడిపేస్తున్నారు. ఒత్తిళ్ల అలసిపోతలో చిరునవ్వును మర్చిపోతున్నాడు మనిషి. కరోనా తర్వాత ప్రజల ఆర్థిక, సామాజిక జీవితంలో చాలా మార్పు వచ్చింది. నిరాశా నిస్పృహలకు, ఆందోళనలకు లోనవుతూ... ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఆనందం కరువై... నవ్వు ముఖం మాయమౌతోంది. నవ్వు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. కానీ, ప్రజలంతా సంతోషంగా వుండే పరిస్థితి నేడు సమాజంలో లేదు. కుల మతాల కుమ్ములాటలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో ప్రజలున్నారు. రోజుకు రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించే అదాని నవ్వు వెనుక... కోట్లాదిమంది అర్థాకలి బతుకులు...నిరాశా నిట్టూర్పులూ దాగివున్నాయి. వీరంతా ప్రశాంతంగా నవ్వుతూ వుండాలంటే సాధ్యమా? పరిమళంలేని ప్లాస్టిక్‌ పూవుల్లా... జీవంలేని నవ్వొకటి ముఖాన పులుముకొని బతుకుబండి లాగవలసి వస్తోంది. ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితిని కల్పించడం పాలకుల బాధ్యత. అయితే, పాలకుల తీరు దీనికి భిన్నంగా వుంది. ఇది ప్రజలకూ, సమాజానికీ ప్రమాదకరం.
ఇప్పుడు మనకు కావాల్సింది జీవంలేని కృత్రిమ నవ్వులు కాదు...పెదాలపై విచ్చుకున్న పువ్వుల్లా స్వచ్ఛమైన చిరునవ్వులు కావాలి. తిక్కన చెప్పినట్లుగా... 32 రకాల నవ్వులు కాకపోయినా, మనసారా ఓ చిరునవ్వైనా నవ్వుకోవాలి. ఎదురొచ్చిన ప్రతివారినీ చిరునవ్వుతో పలుకరించగలగాలి. నిజానికి మనిషన్నోడు అలాగే వుండాలి. కానీ, ఇంకో మతం, కులం, భాష, ప్రాంతం పట్ల విద్వేషభావంతో రగిలిపోకూడదు. 'నిజాయితీగా బతికే ఏ ఒక్కడ్నీ చిరునవ్వు నుంచి దూరం చేయకూడదు.' మనతోపాటు ఎదుటివారు కూడా సంతోషంగా వుండాలని కోరుకోవాలి. పెదవులపై మొగ్గలా విచ్చుకునే చిరునవ్వు ఎదుటివారిని ఆత్మీయులుగా మార్చుతుంది. నిత్యం చిరునవ్వు మొలకలేస్తే... ఆ మనిషిలో ఆరోగ్యం ఉరకలేస్తున్నట్టే. 'ఆనందం అర్ణవమైతే/ అనురాగం అంబరమైతే/ అనురాగపు టంచులు చూస్తాం/ ఆనందపు లోతులు తీస్తాం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ప్రజలంతా చిరునవ్వుతో వుండగలిగితే...ఆ సమాజం ఆనందమయమౌతుంది. ప్రజలందరి మోముపై దరహాస చంద్రికలు ఉదయిస్తాయి.