Sep 25,2021 10:30

సంగారెడ్డి : కడుపులో నొప్పిగా ఉందని ఓ మహిళా ఆసుపత్రికి వెళితే.. శస్త్ర చికిత్స చేసి వెంట్రుకలతో కూడిన 3 కిలోల గడ్డను బయటకు తీసిన ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మర్పల్లి మండలం బూచన్‌ పల్లికి చెందిన శ్రీలత (20)కు ఇటీవల వివాహమైంది. అయితే కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కొత్త పల్లి కిరణ్‌ కుమార్‌, యాదగిరి పరీక్షలు చేసి శ్రీలత కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం శస్త్రచికిత్స చేసి 3 కిలోల గడ్డను బయటకు తీశారు. ఈ గడ్డకు మొత్తం వెంట్రుకలు ఉన్నాయి. చిన్నప్పటి నుండి మానసిక ఒత్తిడి, ఒంటరితం తదితర కారణాలతో ఆమె వెంట్రుకలు తినేవారని, వీటితో పాటు మట్టి, గోడలకు ఉండే సున్నం తినడం వల్ల.. .మొత్తం కలిసి కడుపులో రాయిగా మారిందని అన్నారు. ప్రస్తుతం శ్రీలత పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.