Mar 18,2023 21:40

రోమ్‌ : కరోనా మహమ్మారి ప్రభావాలు, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ బలహీనమైన ఆర్థిక పునరుద్ధరణ క్రమంలో వున్నాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఒఇసిడి) శుక్రవారం పేర్కొంది. 'ఆర్థిక దృక్పథం, తాత్కాలిక నివేదిక' శీర్షికతో శుక్రవారం విడుదలైన ఈ నివేదికలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.6శాతం మేరానే వృద్ధి చెందుతుందని ఒఇసిడి అంచనా వేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి ఇంధన సరఫరాలు, ద్రవ్యోల్బణం వంటి శాశ్వత ప్రభావాలు తగ్గడం వల్ల వచ్చే ఏడాది నాటికి ఈ అభివృద్ధి 2.4శాతం వరకు వుంటుందని పేర్కొంది. ఇంధన ధరలు క్షీణిస్తుండడమనేది ఒక మోస్తరు మెరుగుదలకు దోహదపడిందని ఒఇసిడి ఆ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో కెల్లా చైనా అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆ నివేదిక అంచనా వేసింది. చైనా 5.3 శాతం మేరా అభివృద్ధి చెందితే, అమెరికా ఆర్థిక వృద్ధి 1.5శాతమే వుంటుందని, వచ్చే ఏడాదైతే ఇది 0.9శాతంగానే వుండగలదని అంచనా వేసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు, బాగా దెబ్బతిన్న రంగాలకు ఆర్థిక తోడ్పాటును అందించే చర్యలతో ద్రవ్య విధానాలను కొనసాగించాల్సిందిగా దేశాలను ఒఇసిడి కోరింది.