Sep 14,2022 11:52

పనాజి :   కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేపడుతుండగా.. గోవాలో ఆసక్తికర పరిణామాలు  చోటు చేసుకున్నాయి. గోవాలోని ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపి గూటికి చేరనున్నట్లు సమాచారం. దిగంబర్‌ కామత్‌, మైఖేల్‌ లోబో నేతృత్వంలోని 11 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది అధికార బిజెపిలో చేరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్‌తో భేటీ అయినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు యత్నించడంతో .. కాంగ్రెస్‌ వారిపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైంది. అయితే చివరికి వారు పార్టీ ఫిరాయింపును విరమించుకున్నారు. రెండు నెలల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎనిమిది మంది ఒక బృందంగా విడిపోవడంతో .. పార్టీబలంలో మూడింట రెండొంతుల మంది కావడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉండదు. అయితే ఈ ఫిరాయింపులకు నేతృత్వం వహిస్తున్నారన్న వార్తలను కాంగ్రెస్‌ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ ఖండించారు. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ తొలగించిన మైఖేల్‌ లోబో కూడా ఈ ఫిరాయింపుల గురించి తెలియదని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే లోబో బిజెపి నుండి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.