Jul 29,2021 22:44

ఒలింపిక్స్‌ రింగ్స్‌ వద్ద విసి మొక్కా జగన్నాథరావు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానును యువత స్పూర్తిగా తీసుకొని క్రీడల్లో అభివద్ధి సాధించాలని విసి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ కేంద్ర పరిపాలన భవనం ఎదురుగా ఒలింపిక్స్‌ రింగ్స్‌ను, మీరాబాయి చాను ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వీటిని సందర్శించిన విసి మొక్కా జగన్నాథరావు మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌ నేపథ్యంలో విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని నింపేందుకు ఒలింపిక్‌ రింగ్స్‌ను, విజేతల చిత్రపటాలను విశ్వవిద్యాలయంలో ప్రదర్శిస్తున్నామన్నారు. యువత ఒలింపిక్స్‌ విజయతలను స్పూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ప్రిన్సిపల్స్‌ ఆచార్య ఎస్‌.టేకి, డాక్టర్‌ వి.పెర్సిస్‌, డాక్టర్‌ కె.రమణేశ్వరి, డాక్టర్‌ కె.సుబ్బారావు, విఎస్‌.దేవానంద్‌ పాల్గొన్నారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విసి విడుదల చేశారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, ఎడ్యుకేషన్‌ కళాశాలల్లోని ఆయా కోర్సుల్లో 4,073 మంది విద్యార్థులు పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు రాశారని, వీరిలో 3,234 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఉత్తీర్ణత శాతం 79.40గా ఉందని చెప్పారు. ఎంసిఎ కోర్సుల్లో ఐదో సెమిస్టర్‌ పరీక్షలు 672 మంది విద్యార్థులు రాయగా వీరిలో 574 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.