Oct 18,2020 23:48

ఒంగోలు ప్రజలపై రూ.100 కోట్ల భారం
- రిజిస్ట్రేషన్‌ ఆధారితంగా పెరగనున్న ఆస్థిపన్ను
- ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో
వసూళ్లకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన ప్రభుత్వం
- నీటి పన్ను వందశాతం పెంచేందుకు రంగం సిద్ధం
ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్‌
వడ్డించేవాడు మన వాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా భోజనం అందు తుందనేది ఒకప్పటి సామెత. వడ్డించేది సర్కారైతే ఎవరికైనా వాసి పోవాల్సిందే అనేది నేటి సామెత. నిధులు లేక స్థానిక సంస్థలు నీరసిస్తున్నాయి. పట్టుమని పది లక్షలు పెట్టి ఓ రోడ్డో, కాలువో కట్టే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు కూడా ఏమి లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో పాలక పార్టీలపై పట్టణ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని చల్లార్చాలంటే ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. అందుకు నిధులు కావాలి. ఈ నిధులు ఎక్కడ నుంచి రాబట్టాలని ఆలోచించిన ప్రభుత్వం అభివృద్ధి ఎవరి కోసమైతే చేస్తున్నామో వారి వద్దనుంచే నిధులు రాబట్టాలని నిర్ణయించింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో ఆస్థిపన్నులు, నీటి పన్నులు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. నీటి పన్నులు వందశాతం పెంచాలని ఈపాటికే పురపాలక సంఘాల కమిషనర్లకు ఉత్తర్వులు పంపారు. ఒంగోలు నగరపాలక సంస్థలో దీనిపై కసరత్తు జరుగుతోంది. నీటి పన్నుల పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వచ్చే అవకాశముంది.
ఇక ఆస్థిపన్ను మోతే...
ఇప్పటి వరకూ నివాసిత ప్రాంతం, నివాసితులు కట్టడాల తీరు, నిర్మాణ ప్రాంతంలో కొలతల ఆధారంగా ఆస్థిపన్ను విధిస్తున్నారు. ఇకపై ఆస్థి విలువ ఆధారితంగా, రిజిస్ట్రేషన్‌ ధరల ప్రకారం పన్నులు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే జరిగితే ఒంగోలు నగర ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు పడనున్నాయి. ఒంగోలు నగరంలో 57,881 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటిల్లో నివాస గృహాలు, వ్యాపార, వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి రూ. 20.32 కోట్లు ఆస్థిపన్ను వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ధరల ప్రకారం పన్నులు విధిస్తే ఇది సుమారు ఐదు నుంచి ఆరు రెట్లు పెరుగుతోందనేది ఓ అంచనా. ఇంకా అంతకంటే ఎక్కువ పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని మేధావులు చెబుతున్నారు. అంటే రమారమి ఒంగోలు నగర వాసులపై ఒక్కో ఏడాది రూ.100 కోట్లకు పైగానే ఆస్థిపన్ను భారాన్ని మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మురికివాడల్లో నివాసం ఉండేవారికి, డికె పట్టాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పాత, కొత్త పన్నుల్లో పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
వందశాతం పెరగనున్న నీటి పన్ను....
ఆస్థిపన్ను రిజిస్ట్రేషన్‌ ఆధారంగా పెరిగితే నీటి పన్ను ఏకంగా ఇప్పుడున్న దానిపై వందశాతం పెంచాలని ప్రభుత్వం ఈ పాటికే ఆదేశాలిచ్చింది. నీటి పన్ను ఏ విధంగా పెంచాలో వివరిస్తూ పది పేజీలున్న సంస్కరణల బుక్‌లెట్‌ను ప్రభుత్వం పురపాలక సంఘాలకు పంపింది. ఒంగోలు నగరంలో ప్రస్తుతం 32,796 కులాయి కనెక్షన్లు ఉన్నాయి. అందులో 32,360 వ్యక్తిగత కులాయిలు ఉన్నాయి. ఇవన్నీ 200 బిపిఎల్‌ కులాయిలు, రూ.7500.రూ.10వేలు పన్ను ఆధారిత వ్యక్తిగత కులాయిల జాబితాలోకి వస్తాయి. 214 అపార్ట్‌మెంట్లు, 221 కమర్షియల్‌ కులాయిలు, రిమ్స్‌ వైద్యశాలకు చెందిన ఓ బల్క్‌ కులాయి కనెక్షన్‌ ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం ఏడాదికి రూ. 2.30 కోట్లు ఆదాయం వస్తోంది. దీన్ని వందశాతం పెంచితే రూ.4.60 కోట్లు అవుతోంది. ప్రస్తుతం బిపిఎల్‌ కులాయిలకు నెలకు రూ.60 చొప్పున ఏడాదికి రూ.720 నీటి పన్ను వేస్తున్నారు. అది ఒక్కసారిగా రూ.1,440 కానుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో బిపిఎల్‌ కులాయిలకు నెలకు రూ.200 పన్ను వేసేలా నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే ఇక్కడ కూడా వందశాతం పెరుగుదల కాస్త 150 శాతం 200 శాతానికి కూడా పెరిగే ప్రమాదం లేక పోలేదు. ఇకపై కులాయి కనెక్షన్లు పొందిన తీరును బట్టి బొట్టుబొట్టుకు లెక్క కట్టి ప్రజలకు నీటిని ప్రభుత్వాలే అమ్మే పరిస్థితి దాపురించనుంది.
పెత్తనం ప్రభుత్వం చేతుల్లోనే....
ఇంత పెద్ద ఎత్తున ఆస్థిపన్ను, నీటి పన్నులు పెంచి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నా ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన పైసలపై స్థానిక సంస్థల పెత్తనం ఏమి ఉండదు. సెంట్రలైజ్‌డ్‌ ఫండ్స్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం (సిఎఫ్‌ఎంఎస్‌) ద్వారా వసూలు చేసిన నిధులన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సిబ్బంది జీతాల నుంచి, అభివృద్ధి కోసం చేసిన ఖర్చుల తాలుకు బిల్లులు చెల్లించేందుకు ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడు కోవాల్సిందే. పన్నులు పెంచినా పెత్తనం ప్రభుత్వం చేతిలోకే పోతుందే తప్ప స్థానిక సంస్థలకు పెద్దగా ఒనగూరేదేమి లేదు. పెంచిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా పట్టణాల అభివృద్ధికే వినియోగిస్తామని కూడా ప్రభుత్వం ఎక్కడా స్పష్టత ఇచ్చిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా ఇక ముందుంది మాత్రం పెను భారాల కాలమనే చెప్పాలి.