Jul 29,2021 23:23

నిరసన తెలుపుతున్న నాయకులు

హమాలీ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌:
 విద్యుత్‌ రంగంలో స్టోర్‌లో పని చేస్తున్న హమాలి కార్మికులకు తక్షణమే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నాగరాజు డిమాండ్‌ చేశారు. నాలుగో రోజు నిరసనలో భాగంగా గురువారం ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ శాఖ యాజమాన్యం నేటి ధరలకు అనుగుణంగా లోడింగ్‌ , అన్‌ లోడింగ్‌ కార్మికులకు పీసు రేట్ల పెంచకుండా, ఉన్న రేట్లను 30 శాతం తగ్గించడం చాలా దుర్మార్గం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన హమాలీ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, 10 సంవత్సరాలు సర్వీస్‌ తక్కువ ఉన్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని తీర్పు నిచ్చింది. ఈ తీర్పును తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. నాలుగవ రోజు నిరసన కార్యక్రమాలలో భాగంగా హమాలీ కార్మికులు ఒంటికాలుతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి ఎండి. అంజిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, వియోగదరులకు, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హమాలి యూనియన్‌ నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సి.చలపతి, జి.సురేష్‌, కె.మోహన్‌, ఎం.భీసన్న, సి.అంజినేయులు, బి. చంద్రశేఖర్‌, బి.వెంకటేశ్‌, సి.విజయుడు, పి.రామి రెడ్డి, సి.పుల్లన్న పాల్గొన్నారు.